విడుదల తేదీ : ఫిబ్రవరి 4, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : రవి ప్రకాష్, రాకీ సింగ్, తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి తదితరులు
ధర్శకుడు : రేవంత్ లెవక
నిర్మాతలు : జ్యోతి మెఘావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కమ్మిరెడ్డి, తిరుపతి శ్రీనివాస్ రావు
సంగీత దర్శకుడు : గౌర హరి
సినిమాటోగ్రఫీ : రోహిత్ బచ్చు
ఎడిటర్ : కిషోర్ మద్దాలి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
రవి ప్రకాష్, రాకీ సింగ్, తరుణ్ రోహిత్, శ్యామల ముఖ్య పాత్రల్లో నటించిన తెలుగు వెబ్ సిరీస్ ‘కోబలి’ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
ఏపీ, తెలంగాణ సరిహద్దలోని రాయలసీమలోని ఓ ఫ్యాక్షన్ ప్రాంతంలో ఈ కథ సాగుతుంది. సాంబయ్య(రేవంతినాథ్) కొడుకులు గోపి(శివ), శ్రీను(రవి ప్రకాష్), రాము(తరుణ్ రోహిత్) ముగ్గురు సోదరులు. రమణ(రాకీ సింగ్) అనే వ్యక్తి సోదరితో గోపి అక్రమసంబంధం పెట్టుకుంటాడు. అయితే, ఓ గొడవలో ఆమె మృతిచెందుతుంది. దీంతో గోపీపై పగ పెంచుకుంటాడు రమణ. గోపీతో పాటు అతడి కుటుంబాన్ని నాశనం చేయాలని రమణ భావిస్తాడు. దీంతో అక్కడ జరిగే రక్తపాతాన్ని చూసి శ్రీను కూడా ఇందులోకి దిగుతాడు. ఆ తర్వాత జరిగే పగ, నమ్మకద్రోహం వంటి అంశాలతో ఈ కథ ముందుకు సాగుతుంది.
ప్లస్ పాయింట్స్:
ఈ వెబ్ సిరీస్‌లో రవి ప్రకాష్ సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటాడు. తనదైన యాక్టింగ్‌తో ఈ వెబ్ సిరీస్‌కే ఆయన హైలైట్‌గా నిలిచాడు. విలన్ పాత్రలో రాకీ సింగ్ కూడా చక్కటి నటన కనబరిచాడు.
ఇక మిగతావారిలో తరుణ్ రోహిత్, శ్యామల, శివ తమ పాత్రలమేర ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇచ్చిన పాత్రలను వారు బాగానే పోషించారు.
మైనస్ పాయింట్స్:
ఈ వెబ్ సిరీస్ ప్రారంభంలో మంచి కథను చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే, కథ సాగుతున్నకొద్దీ, ఈ వెబ్ సిరీస్ ట్రాక్ తప్పుతుంది. ఇలాంటి కథను గతంలో చాలాసార్లు చూసినట్లుగా అనిపిస్తుంది. దీంతో తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించగలం. ఇలాంటి కథకు డెప్త్ తీసుకొచ్చే సరైన స్క్రీన్‌ప్లే మనకు ఇందులో మిస్ అయ్యింది.
ఈ కథను చూస్తుంటే ఇది అసంపూర్తిగా ఉన్నట్లు.. ఎలాంటి ట్విస్టులు, ఆకట్టుకునే యాక్షన్ లేకుండా కనిపిస్తుంది. వైలెంట్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుంది.
ఇక ఇందులో చాలా బోల్డ్ డైలాగులు ఉండటం ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పెద్దగా నచ్చవు. ఇది 18+ వయసు గల వారికోసం తీసినప్పటికీ, ఇందులో వాడిన కొన్ని బోల్డ్ డైలాగులు కొంతమేర హద్దు దాటినట్లుగా కనిపిస్తాయి.
ఇందులో కనిపించే పాత్రలు చాలానే ఉన్నా, కొందరిని మాత్రమే ఆడియెన్స్ గుర్తుపెట్టుకుంటారు. పాత్రలను బలంగా రాసుకోకపోవడం, ఎమోషనల్ డెప్త్ లోపించడం వంటివి ఈ వెబ్ సిరీస్‌కు మైనస్.
సాంకేతిక వర్గం:
‘హను-మాన్’ చిత్రానికి సంగీతం అందించిన గౌర హరి ఈ వెబ్ సిరీస్‌కు మ్యూజిక్ అందించాడు. అయితే, ఆయన ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా యావరేజ్‌గా కనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ వర్క్‌లో కొన్ని లోపాలు కనిపించాయి. కొన్ని సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. రేవంత్ లెవక ఈ వెబ్ సిరీస్‌ను ఆసక్తికరంగా మలచడంలో తడబడ్డాడు. ఆయన రాసుకున్న డైలాగులు తేలిపోయాయి. ముఖ్యంగా బోల్డ్ డైలాగులు ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు ఆ సీన్స్‌ను స్కిప్ చేస్తారు.
తీర్పు:
ఓవరాల్‌గా ‘కోబలి’ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బలమైన కథ లేకపోవడం, స్క్రీన్ ప్లే తేలిపోవడం, అనవసరమైన బోల్డ్ డైలాగ్స్ కలగలిసి ఈ వెబ్ సిరీస్‌కు డ్యామేజ్ చేశాయి. రవి ప్రకాష్, రాకీ సింగ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా, ఓవరాల్‌గా ప్రేక్షకులను ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకోదు. ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారు ఈ వీకెండ్ వేరే ఆప్షన్స్ చూసుకోవడం బెటర్.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team