క్రిష్ ‘గబ్బర్’ ట్రైలర్‌కు విశేష స్పందన!

క్రిష్ ‘గబ్బర్’ ట్రైలర్‌కు విశేష స్పందన!

Published on Mar 24, 2015 1:28 PM IST

Gabbar-Krish
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ లాంటి చిత్రాలతో తెలుగులో సరికొత్త కథాంశాల నేపథ్యంలో నడిచే సినిమాలతో కొత్త పంథాకు నిర్దేశం చేసిన దర్శకుడు.. క్రిష్. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా, క్రిష్ హిందీలో దర్శకత్వం వహించిన సినిమా.. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’. ఈ సినిమా ట్రైలర్‌ను నిన్న సాయంత్రం విడుదల చేశారు. గతంలో తమిళంలో నిర్మించబడి సూపర్ హిట్‌గా నిలిచిన మురుగదాస్ సినిమా ‘రమణ’కి రీమేకే ఈ గబ్బర్. ఇక ‘రమణ’ సినిమా, తెలుగులో ‘ఠాగూర్’ పేరుతో చిరంజీవి హీరోగా రీమేక్ అయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఠాగూర్ హిందీ రీమేక్‌కు చాలా పేర్లు తెరపైకి వచ్చినా, చివరకు దర్శకుడు క్రిష్‌ను అవకాశం వరించింది. ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక నిన్న విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్. క్రిష్ తన మార్క్‌ని నిలబెట్టుకుంటూనే ఎక్కడా మాతృక సినిమాకు దూరంగా ఈ సినిమాని నడిపించలేదన్నది స్పష్టమవుతోంది. క్రిష్ మేకింగ్ స్టైల్‌కి బాలీవుడ్ విశ్లేషకుల నుండి మంచి స్పందన వస్తోంది. వేసవి కానుకగా మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అక్షయ్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు