సమీక్ష : లక్ష్మీస్‌ ఎన్టీఆర్- వాస్తవం కన్నా నాటకీయత ఎక్కువైంది !

సమీక్ష : లక్ష్మీస్‌ ఎన్టీఆర్- వాస్తవం కన్నా నాటకీయత ఎక్కువైంది !

Published on Mar 30, 2019 1:03 PM IST
Lakshmis NTR movie review

విడుదల తేదీ : మార్చి 29, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : పి విజయ్ కుమార్, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్ తదితరులు.

దర్శకత్వం :  రామ్ గోపాల్ వర్మ

నిర్మాత :  రాకేష్ రెడ్డి మరియు దీప్తి బాలగిరి

సంగీతం :  కళ్యాణి కోడూరి

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మహానటుడు ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఒకసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

ఎన్టీఆర్ (పి విజయ్ కుమార్) తన మన దేశం పార్టీ ఓడిపోయిన తరువాత, ఒంటరిగా ఉంటున్న రోజులు అవి. ఆ సమయంలో లక్ష్మీ పార్వతి (యజ్ఞ శెట్టి) ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాస్తా అని, ఎన్టీఆర్ వద్దకు వస్తోంది. జీవితం పట్ల ఆమెకున్న లోతైన అవగాహన నచ్చిన ఎన్టీఆర్ అందుకు అంగీకరిస్తారు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతికి మానసికంగా చాలా దగ్గర అవుతారు. అది నచ్చని సి.బి నాయుడు (శ్రీ తేజ్) మరియు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కి దూరం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో.. మళ్ళీ ఎన్టీఆర్ పార్టీ అఖండ విజయంతో అధికారంలోకి వస్తోంది. మన దేశం పార్టీలో కూడా లక్ష్మి పార్వతికి ఆదరణ పెరుగుతుంది.

దాంతో సిబి నాయుడు కొంతమంది సహాయంతో ఎన్టీఆర్ ను సీఎం పీఠం నుండి దించుతాడు. అసలు ఎన్టీఆర్ ను ఎందుకు అధికారంలో నుండి దించారు ? ఎలాంటి వ్యూహాలతో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు ? చివరికి ఎన్టీఆర్ ఎంత బాధతో చనిపోయారు ? చనిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. ముందుగా ఈ సినిమాకు ప్రధాన బలం, బలగం వర్మ క్రియేట్ చేసిన హైపే. ఇక మహానటుడు ఎన్టీఆర్ పాత్రలో పి విజయ్ కుమార్ చాలా బాగా నటించారు. అయితే ఎన్టీఆర్ ఆహార్యం ముందు ఆయన విగ్రహం తెలిపోయినా.. ఎన్టీఆర్ హావభావాలను, తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక లక్ష్మి పార్వతి పాత్రను పోషించిన యజ్ఞ శెట్టి అద్భుతంగా నటించి మెప్పించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ – లక్ష్మి పార్వతిల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో చాల బాగా నటించింది. సి.బి నాయుడు పాత్రలో కనిపించిన శ్రీ తేజ్, ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. మెయిన్ గా తన లుక్స్ తోనే విలనిజాన్ని పండించాడు.

హరికృష్ణ, బాలకృష్ణ మరియు ఇతర కుటుంబ సభ్యుల పాత్రల్లో నటించిన నటీనటులు, అదేవిధంగా మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో అబ్బుర పరుస్తారు.

 

మైనస్ పాయింట్స్ :

తెలుగు సినీ పరిశ్రమను తన కను సైగలతోనే ఏలిన ఎన్టీఆర్, అదే విధంగా.. రాజయాలను సైతం శాసించి.. ప్రతి తెలుగు వాడి హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అంతటి మహానటుడు, మహానాయకుడును అతి సాధారణమైన వ్యక్తిగా మరి నాటకీయంగా చూపించడం ఏమి బాగాలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన కొన్ని నాటకీయ అంశాలనూ, అప్పటి పరిస్థితులను చాలా ఆసక్తికరంగా చూపించడంలో దర్శకులు విఫలం అయ్యారు. ఎన్టీఆర్, లక్ష్మి పార్వతితో తనని పెళ్లి చేసుకోమని అడిగినట్లు చెప్పించే సీన్ కూడా అస్సలు కన్విన్స్ కాదు.

పైగా ఎన్టీఆర్ జీవితంలో జరిగిన వెన్నుపోటు ఘట్టం కేవలం ఒక వ్యక్తినే చేశాడని చూపించారు, కానీ అప్పటి పరిస్థితులు, పార్టీలోని అప్పటి ప్రముఖ నాయకులందరీ అభిప్రాయాలు, అన్నిటికీ మించి ఎన్టీఆర్ కుంటుంబం సభ్యుల అవసరాల రీత్యా.. ఎన్టీఆర్ ను సీఎం పీఠం నుండి దించేయడం జరిగింది. కానీ ఇన్నీ పెద్ద నాటకీయ కోణాల్ని వర్మ వదిలేసి… పూర్తిగా ఒక వ్యక్తే ఎన్టీఆర్ ను దించేసాడని చూపించడం కూడా అంతగా రుచించదు.

ఇక ఎన్టీఆర్ పాత్రలో నటించిన పి విజయ్ కుమార్ బాగానే నటించనప్పటికీ, ఎన్టీఆర్ లా ఆయన్ని ఎక్కువ సేపు ఊహించుకోలేం. వీటికి తోడు సినిమాకి ప్రధాన మైనస్ స్లో నరేషన్. ఫస్ట్ హాఫ్ మెత్తం ఎక్కువుగా రెండు పాత్రల మధ్యే నడిపడంతో సినిమాని బాగా సాగతీసినట్లుగా అనిపిస్తుంది. పైగా కొత్త విషయాలు లేకపోగా అందరికీ తెలిసిన విషయాలనే మళ్ళీ చూపించారు. ఇక ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి, సి. బి నాయుడు పాత్రలు తప్ప మిగితా పాత్రలు పెద్దగా రిజిస్టర్ అవ్వవు.

 

సాంకేతిక వర్గం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. దర్శకులు కొన్ని బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేసినా.. అది పెద్దగా వర్కౌట్ కాలేదు.

సంగీత దర్శకుడు కళ్యాణి కోడూరి తన పాటలతోనే కాకుండా, తన నేపథ్య సంగీతంతో కూడా ఆకట్టుకున్నారు. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. కథకి అనుగుణంగా సినిమాలోని సన్నివేశాలని, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చక్కగా చిత్రీకరించారు.

అయితే ఎడిటింగ్ విషయంలో మాత్రం ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. రాకేష్ రెడ్డి మరియు దీప్తి బాలగిరి నిర్మాణ విలువులు బాగానే ఉన్నాయి.

 

తీర్పు :

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన ఈ చిత్రం పూర్తి ఆసక్తికరంగా సాగలేదు. అయితే కొన్ని చోట్ల ఎమోషనల్ గా సాగుతూ అక్కడక్కడ పర్వాలేదనిపిస్తోంది. అయితే సినిమాలో కొన్ని సీన్స్ ను ఎమోషనల్ గా నడిపిన దర్శకులు, చాలా సన్నివేశాల్లో మాత్రం ఆ ఎమోషన్ని ఆ స్థాయిలోనే కంటిన్యూ చేయలేక పోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన కొన్ని నాటకీయ అంశాలనూ, అప్పటి పరిస్థితులను చాలా ఆసక్తికరంగా చూపించడంలో దర్శకులు విఫలం అయ్యారు. పైగా ఎన్టీఆర్, లక్ష్మి పార్వతితో తనని పెళ్లి చేసుకోమని అడిగినట్లు చెప్పించే సీన్ లాంటి కొన్ని సీన్స్ బాగా నిరుత్సాహ పరుస్తాయి. మొత్తం మీద ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంచనాలను అందుకోలేకపోయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు