మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘విశ్వంభర’ విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట్లో ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేస్తారని ప్రచారం జరిగినా, ఆ ఛాన్స్ అస్సలు లేదు. ఆ తర్వాత ఆగస్ట్ రిలీజ్ అంటూ వార్తలు వచ్చినా, మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఎలాగైనా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిసెంబర్ నుండి టాలీవుడ్‌లో వరుసగా భారీ చిత్రాలు పోటీలో ఉన్నాయి. ఇక 2027 సంక్రాంతి, సమ్మర్ సీజన్లు కూడా ఇప్పటికే క్రేజీ ప్రాజెక్ట్స్‌తో పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. పైగా వచ్చే ఏడాది ప్రారంభంలోనే చిరంజీవి – బాబీ కాంబినేషన్ మూవీ కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’కు దసరా లేదా ఈ ఏడాది చివర్లో వచ్చే ఏదైనా ఒక మంచి డేట్ మాత్రమే ఏకైక ఆప్షన్‌గా కనిపిస్తోంది. మేకర్స్ ఇకనైనా ఒక డెడ్‌లైన్ పెట్టుకుని సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది.
వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ గతేడాదే పూర్తయింది. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


