సమీక్ష : “మహా వీరుడు” – కొన్ని చోట్ల మెప్పించే యాక్షన్ కామెడీ డ్రామా!

సమీక్ష : “మహా వీరుడు” – కొన్ని చోట్ల మెప్పించే యాక్షన్ కామెడీ డ్రామా!

Published on Jul 15, 2023 3:05 AM IST
Mahaveerudu Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 14, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: శివకార్తికేయన్, అదితి శంకర్, మిస్కిన్, యోగి బాబు, సరిత, సునీల్, మోనిషా బ్లెస్సీ , తదితరులు

దర్శకుడు : మడోన్నా అశ్విన్

నిర్మాత: అరుణ్ విశ్వ

సంగీతం: భరత్ శంకర్

సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న

ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

శివకార్తికేయన్ హీరోగా మడోన్నా అశ్విన్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ-డ్రామా మహా వీరుడు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

సత్య (శివకార్తికేయన్) ఓ పిరికివాడు. తన తల్లి (సరిత) మరియు చెల్లితో కలిసి ఓ బస్తీలో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఐతే, ఇష్టం లేకపోయినా ప్రభుత్వం ఇచ్చిన ఓ అపార్ట్ మెంట్స్ లోకి తమ బస్తీవాసులతోటి కలిసి వెళ్లాల్సి వస్తోంది. అయితే, ఆ అపార్ట్ మెంట్స్ చాలా నాసిరకంగా కట్ట బడి ఉంటాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సత్య తన బస్తీ వాసులను ఎలా సేవ్ చేశాడు?, ఆ అపార్ట్ మెంట్స్ ను అంత దారుణంగా కట్టిన మంత్రికి సత్య ఎలా బుద్ది చెప్పాడు?, ఈ మధ్యలో చంద్రమతి (అదితి శంకర్)తో సత్య లవ్ ట్రాక్ ఎలా సాగింది?, చివరకు సత్య మహావీరుడు అయ్యాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఓ పిరికివాడు మహావీరుడిగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రజల కోసం చేసే పోరాటానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించడం బాగుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన శివకార్తికేయన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో మరియు ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా శివకార్తికేయన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన అతిధి శంకర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. హీరోకి తల్లిగా నటించిన సీనియర్ నటి సరిత కూడా చాలా బాగా నటించింది. యోగి బాబు పంచ్ లు అండ్ కామెడీ టైమింగ్ కూడా బాగున్నాయి. సునీల్ తో సహా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన మహావీరుడి ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన సీన్స్.. మరియు విలన్ తో పాటు మిగిలిన పాత్రలు.. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు మడోన్నా అశ్విన్ కొన్ని చోట్ల తడబడ్డాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ అలాగే మంచి యాక్షన్ ఫీస్ట్ గా ప్లేని నడపాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ పెరగాలి. కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది. సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదు.

హీరో విలన్ దగ్గరకి వెళ్లి లొంగిపోయే దగ్గర నుంచి సాగే సన్నివేశాలు పేలవంగా సాగుతాయి. దీనికితోడు లాజిక్స్ కూడా ఎక్కడ కనిపించవు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ కు కూడా సరైన బలం లేదు. అలాగే పేద ప్రజల కోసం కట్టిన బిల్డింగ్ సమస్యను కూడా బలంగా చూపించడంలో దర్శకుడు నిరాశ పరిచాడు. అసలు ఈ కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేయవచ్చు. ఫస్ట్ హాఫ్ నిజంగానే ఫన్ తో సాగింది. ఆ ఫన్ ను కూడా దర్శకుడు సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోయాడు.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా భరత్ శంకర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలో నిర్మాత అరుణ్ విశ్వ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

 

మహావీరుడు అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, మహావీరుడి ట్రాక్, మరియు కామెడీ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అలాగే, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా పర్వాలేదనిపిస్తాయి. అయితే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ కావడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఐతే, సినిమాలో శివకార్తికేయన్ నటన చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు