
టాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా గర్వించదగ్గ విధంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. దీనితో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’. బాహుబలి సినిమాని జూలై 10న రిలీజ్ చేయనున్నామని అనౌన్స్ చెయ్యడంతో జూలై 17న రిలీజ్ కావాల్సిన మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాని వాయిదా వేసుకున్నారు. ఇద్దరు నిర్మాతలు కూర్చుని చర్చించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పినా మీడియాలో ఇంకా కొన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఆ వార్తలకు ఈ రోజు మహేష్ బాబు ఫుల్ స్టాప్ పెట్టేసాడు.
రెయిన్ బో హాస్పిటల్స్ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ బాబు శ్రీమంతుడు వాయిదా గురించి మాట్లాడుతూ ‘ బాహుబలి లాంటి పెద్ద సినిమా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రావడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. అలాంటి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు దానికోసం ఒక రెండు మూడు వారాలు గ్యాప్ ఇవ్వాలి. అలా కాకుండా వెంటనే వచ్చేస్తే బాగుండదు. బాహుబలికి ఏమన్నా అయితే మేము కూడా బాగా ఎఫెక్ట్ అవుతాం. అందుకే అలాంటి సినిమాకి మరో పెద్ద సినిమాకి గ్యాప్ ఇవ్వాలి. అందుకే బాహుబలి వచ్చి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఆ తర్వాత వచ్చే నా సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నానని’ తెలిపాడు. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఆగష్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

