టాలీవుడ్ యువరాజు మహేష్ పుట్టిన రోజు నేడు

Published on Aug 9, 2019 9:25 am IST

టాలీవుడ్ యువరాజు, అమ్మాయిల కలల రాజకుమారుడు మహేష్ బాబు జన్మదినం నేడు. 1975 ఆగస్టు 9న జన్మించిన ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో మహేష్ నేడు 44వ వసంతంలోకి అడుగిడనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన మహేష్ బాబు తండ్రికి మించిన తనయుడిగా పేరుతెచ్చుకున్నాడు.

మహేష్ బాలనటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో మురళి మోహన్ హీరోగా 1979లో వచ్చిన నీడ చిత్రంలో ఓ చిన్న పాత్రతో బాలనటుడిగా పరిచయమైన మహేష్ తరువాత తండ్రితో కలిసి 5చిత్రాలలో నటించారు. బాల నటుడిగా కూడా మహేష్ హీరో రేంజ్ పాత్రలు చేసి స్టార్ కిడ్ అనిపించుకున్నారు. తండ్రితో కలిసి ఆయన సాహసోపేతమైన పాత్రలలో నటించడం జరిగింది. తండ్రి కృష్ణకు “ముగ్గురు కొడుకులు”, “అన్న- తమ్ముడు” వంటి చిత్రాలలో మహేష్ తమ్ముడు పాత్ర చేయడం విశేషం. దాదాపు తొమ్మిది చిత్రాల్లో మహేష్ బాలనటుడిగా చేశారు.

ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1999లో వచ్చిన రాజకుమారుడు చిత్రంతో మహేష్ పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు, ప్రీతి జింటా జంటగా జులై 30 1999 లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం మూడురెట్ల వసూళ్లతో 16కోట్లు సాధించింది. మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. ముఖ్యంగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలు ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఆయన స్వరపరచిన ఆరు పాటలు యూత్ ని ఆకట్టుకొని చాలా రోజులు ట్రెండ్ అయ్యాయి.

హీరోగా ఆరంగేట్రమే ఘనంగా చేసిన మహేష్ హీరోగా 20ఏళ్ల కెరీర్లో మురారి,ఒక్కడు,అతడు,పోకిరి,దూకుడు,బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. ఆచితూచి సినిమాలు చేసే మహేష్ 20 ఏళ్ల కెరీర్లో చేసింది కేవలం 25 చిత్రాలు మాత్రమే. కాగా ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటిస్తున్నారు.ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ కి 123తెలుగు తరపున హృదయపూర్వక పుట్టిన రోజు శుభకాంక్షలు.

సంబంధిత సమాచారం :

More