న్యాయ వ్యవస్థపై మహేష్-మురుగదాస్‌ల సినిమా?

న్యాయ వ్యవస్థపై మహేష్-మురుగదాస్‌ల సినిమా?

Published on Oct 13, 2015 8:02 PM IST

Mahesh-babu-murugadoss

దర్శకుడు మురుగదాస్ గురించి, అతడి సినిమాల గురించి ఇండియన్ సినిమా ప్రేక్షకుడికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గజిని, స్టాలిన్, తుపాకి, కత్తి, ఠాగూర్ సినిమా తమిళ మాతృక.. ఇలా దర్శకుడిగా మురుగదాస్ సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఆయన సూపర్ స్టార్ మహేష్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మహేష్ స్టార్‌డమ్‌కు సరిగ్గా సరిపోయేలా మురుగదాస్ ఓ బలమైన కథను సిద్ధం చేశారట.

తన ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక బలమైన అంశాన్ని చెప్పాలనుకునే మురుగదాస్ మహేష్‌కు కూడా సోషల్ మెసేజ్ ఉన్న కథనే రూపొందించారని తెలుస్తోంది. ఠాగూర్ (తమిళంలో రమణ)లో లంచగొండితనం, ‘స్టాలిన్‌’లో ఇతరులకు సాయపడాలన్న ఆలోచన, ‘తుపాకి’లో ఓ జవాను నేపథ్యం, ‘కత్తి’లో రైతుల పోరాటం.. ఇలా బలమైన సామాజిక అంశాలను స్పృశిస్తూ వెళుతోన్న మురుగదాస్, మహేష్ కోసం రాసిన కథలో న్యాయ వ్యవస్థలోని లోటుపాట్లను ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. ఈ విషయమై ఇంకా ఎలాంటి ప్రకటనా రాకపోయినా అభిమానులు మాత్రం ఈ ప్రచారంపై చాలా హ్యాపీగా ఉన్నారు. మహేష్-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో సామాజిక అంశమంటే కచ్చితంగా దాని రేంజ్ మామూలుగా ఉండదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

తాజా వార్తలు