విదేశాల్లో పోరాడనున్న మహేష్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ల కలయికలో రూపొందుతున్న చిత్రం పై ప్రేక్షకులు, అభిమానుల్లో ఎంతటి భారీ అంచనాలున్నాయి వేరే చెప్పనక్కర్లేదు. చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అనంతరం 11 వ తేదీ నుండి చెన్నైలో షెడ్యూల్ జరుపనున్న యూనిట్ ఆ తర్వాత 23 న వియత్నాం వెళ్లనున్నారు. అక్కడే 30వ తేదీ వరకు కొన్ని కీలకమైన పోరాట సన్నివేశాలని తెరకెక్కించనున్నారట మురుగదాస్.

భారీ మొత్తం ఖర్చు పెట్టి రూపొందించనున్న ఈ ఫైట్ సీన్ల కోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రఫర్లు పీటర్ హెయిన్స్, కణల్ కణ్ణన్, అన్బరివ్ లు పనిచేస్తున్నారు. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా లో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 23 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్ల విడుదల తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది .