
మళయాలంలో సంచలన విజయం సాధించిన ‘ప్రేమమ్’ సినిమాను తెలుగులో అక్కినేని నాగ చైతన్య ‘మజ్నూ’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రేమకథలతో ఇప్పటికే యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన చైతూ, ఈ సినిమా తనకు మరింత పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకాన్ని సినిమా లాంచ్ సందర్భంగా వెలిబుచ్చారు. ‘కార్తికేయ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న మజ్నూ రేపట్నుంచి సెట్స్‌పైకి వెళ్ళనుంది.
రేపు వైజాగ్ పరిసరాల్లో మొదలయ్యే షూటింగ్ వరుసగా కొన్ని రోజుల పాటు జరగనుంది. ప్రేమమ్ సినిమా ఫీల్ ఏమాత్రం తగ్గకుండా, తెలుగు నేటివిటీకి తగ్గ కొన్ని మార్పులతో చందూ మొండేటి స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసేశారు. నాగ చైతన్య సరసన అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్. ఇషాలు హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.

