
‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’.. శర్వానంద్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమకథ. ఈ సంవత్సరం ఫిబ్రవరి 6న విడుదలైన ఈ సినిమా చాన్నాళ్ళ తర్వాత తెలుగులో వచ్చిన అందమైన ప్రేమకథగా గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ పరంగానూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకు యూట్యూబ్‌లోనూ విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. వారం క్రితం ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ పూర్తి సినిమాను యూట్యూబ్‌లో విడుదల చేశారు. యూట్యూబ్‌లో విడుదలైన వారం రోజులకే 10 లక్షల వ్యూస్ సంపాదించి ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ సినిమాకు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారన్న విషయం యూట్యూబ్ లెక్కలతో మరోసారి ఋజువైందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ తెలుగులో యూట్యూబ్‌లో విడుదలైన సినిమాల్లో ‘ఎవడు’ 60లక్షల పైచిలుకు వ్యూస్ సాధించి నెంబర్ వన్‌గా నిలిచింది. ఈ రికార్డును ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ త్వరలోనే అధిగమిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

