విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలను హుధూద్ తుఫాన్ కళావిహీనంగా మార్చేసింది. సుందరమైన నగరాన్ని అతలాకుతలం చేసింది. ఈ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ముందడుగు వేసింది మంచు కుటుంబం. తమ సినిమా విడుదల వాయిదా వేయడంతో పాటు మనోజ్, విష్ణులు విశాఖ వెళ్లి అక్కడ సహాయక చర్యలలో నేరుగా పాల్గొంటున్నారు. అభిమానులను సహాయక చర్యలలో పోల్గోనవలసిందిగా అర్ధిస్తున్నారు.
శ్రీ విధ్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరుపున మంచు ఫ్యామిలీ సహాయక చర్యలు చేపట్టారు. ‘యూనిటీ – లెట్స్ రీ బిల్ట్ వైజాగ్’ పేరుతో అభిమానులను చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి తుఫాన్ భాదితులకు సహాయం చేయడం కోసం విరాళాలు కోరుతున్నారు. వీలైనంత మందికి ప్రత్యక్షంగా సహాయం చేయడం కోసం ఈ మార్గం ఎంచుకున్నట్టు మంచు మనోజ్ తెలిపారు. ప్రభుత్వం గొప్ప పనితీరు కనబరుస్తుంది, మనం కూడా చేతనైనంత సహాయం చేద్దాం అంటూ పిలుపునిచ్చారు. ఈ దీపావళి ఖర్చును విరాళంగా ఇవ్వమని కోరారు.


