
అందమైన కుటుంబ బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో చక్కటి సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దశరథ్, విలక్షణ సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్‌తో ఓ సినిమా కోసం జతకట్టిన విషయం తెలిసిందే. సురక్ష ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎం.శివకుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పకడ్బందీగా పూర్తి చేసుకొని నేడు సెట్స్‌పైకి వెళ్ళింది.
ఓ సరికొత్త స్టోరీలైన్‌తో రూపొందనున్న ఈ సినిమా జూలై నెలలో లాంఛనంగా ప్రారంభమై నేడు హైద్రాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ మొదలుపెట్టింది. ఇక తన కొత్త సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా మనోజ్ తన ఆనందాన్ని పంచుకున్నారు. “దర్శకుడు దశరథ్‌తో కలిసి చేస్తోన్న సినిమా షూటింగ్ ఈ రోజే మొదలైంది. సూపర్ స్క్రిప్ట్. చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా” అని తెలిపారు. మనోజ్ సరసన రెజీనా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు గోపీ మోహన్ స్క్రిప్ట్ సమకూర్చారు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.