ఈ వారం జూన్ 12, 2026 (శుక్రవారం) నాడు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొననుంది. ఇంతియాజ్ అలీ ‘మై వాపస్ ఆవుంగా’, కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’, విక్రమ్ భట్ ‘హాంటెడ్ 3D: ఎకోస్ ఆఫ్ ది పాస్ట్’ చిత్రాలతో పాటు మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గవర్నర్’ సినిమా కూడా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతటి గట్టి పోటీని తట్టుకుని, ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించేందుకు ‘గవర్నర్’ చిత్ర బృందం ఒక వినూత్నమైన వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది.
తమ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టేందుకు, ఈ చిత్ర నిర్మాతలు మొదటి 25,000 టిక్కెట్లను కేవలం రూ.50 లకే అందించనున్నారు. 1990ల నాటి సగటు సినిమా టికెట్ ధరను గుర్తుచేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రేక్షకులు బుక్‌మైషో యాప్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు GOVERNOR90 అనే కూపన్ కోడ్‌ని ఉపయోగించి ఈ అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు. అత్యంత తక్కువ ధరకే ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం కల్పించడం ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది.
భారతదేశ ఆర్థిక చరిత్రలోని ఒక కీలకమైన ఘట్టం ఆధారంగా ఈ పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ థ్రిల్లర్ తెరకెక్కింది. 1990వ దశకంలో దేశం ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయిన క్లిష్ట పరిస్థితుల్లో అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ ఎస్.వెంకటరమణన్ దేశాన్ని ఆర్థిక పతనం నుండి ఎలా కాపాడారనేదే ఈ సినిమా కథాంశం. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.


