‘ఆదిపురుష్’ అగ్ని ప్రమాదం వెనుక ఇంత కథ ఉందా ?

Published on Mar 3, 2021 6:00 pm IST

ఇండియాలో రూపొందుతున్న అతి పెద్ద సినిమాల్లో ప్రభాస్ చేస్తున్న ‘ఆదిపురుష్’ ఒకటి. భారీ వ్యయంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. స్టార్ నటీనటులు, అత్యుత్తమ సాంకేతిక నిపుణులు దీని కోసం పనిచేస్తున్నారు. అలాంటి ప్రాజెక్ట్ అంటే ఎంత కేరింగ్ ఉంటుంది యూనిట్ సభ్యుల్లో. కానీ షూటింగ్ తొలిరోజే సెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోట్ల రూపాయల నష్టం వారిల్లింది. సమయానికి సెట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఏకంగా 8 ఫైర్ ఇంజన్లు వస్తే గానీ మంటలు అదుపుకాలేదు అంటే ప్రమాదం తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

మొదటిరోజే ఈ ప్రమాదం జరగడంతో చిత్ర బృందం ఖంగుతింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సెట్ తగలబడింది అంటే ఎవ్వరూ నమ్మలేకపొతున్నారు. కేవలం నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది అంటే ఒప్పుకోబోమని చిత్ర బృందం అంటోంది. అంతేకాదు అసలు కారణం తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారట. వారి విచారణలో ప్రమాదం వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానం కలిగిందట వారికి. సినిమా మొదలయ్యే కొన్నిరోజుల ముందు సినిమాలో రావణుడి పాత్ర చేయాల్సిన నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త పెను దుమారాన్ని లేపాయి.

అనేకమంది సైఫ్ తీరును తీవ్రంగా ఖండించారు. సైఫ్ సైతం ఊహించని వ్యతిరేకతతో బహిరంగ క్షమాపణ చెప్పుకున్నారు. అయినా చల్లారని ఆ వ్యతిరేకత తాలూకు ఫలితమే ఈ అగ్నిప్రమాదమని అనుమానిస్తున్నారట. కారణం ఏదైనా కూడ ‘ఆదిపురుష్’ టీమ్ మాత్రం అంతటి ప్రమాదం జరిగినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :