ఇంటర్వ్యూ : మెహ్రీన్ – ఈ కథ విన్నాక నాకు గూజ్ బంప్స్ వచ్చాయి.

Published on Jan 11, 2020 5:22 pm IST

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. కాగా ఈ సందర్భంగా మెహ్రీన్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

‘ఎఫ్ 2’లో మీ క్యారెక్టర్ చాల పాపులర్ అయింది. మరి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?

 

‘ఎఫ్ 2’లో హాని క్యారెక్టర్ చాల పాపులర్ అయింది, బేసిగ్గా నాకు కామెడీ అంటే బాగా ఇష్టం. అందుకే ఆ క్యారెక్టరైజేషన్ నాకు బాగా కనెక్ట్ అయింది. అలాగే ఈ సినిమాలో కూడా నా క్యారెక్టర్ చాల ఎమోషనల్.. చాల మెచ్యూర్డ్.. అలాగే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. అందరికీ నచ్చుతుంది. సినిమాలో నేను నిర్మాతగా కూడా నటించాను.

 

ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్ మీదే ఉంటుందా ? లేక కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయా ?

 

సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అలాగే యాక్షన్ అండ్ కమర్షియల్ అంశాలు కూడా హైలైట్ గా ఉంటాయి. మీరందరూ ట్రైలర్ చూశారు కదా. ట్రైలర్ లో ఎమోషన్స్ అండ్ యాక్షన్ తో పాటు కామెడీ యాంగిల్ ను కూడా బాగా ఎలివేట్ అయ్యాయి. సినిమా కూడా అలాగే ఉంటుంది. అందరిని ఆకట్టుకుంటుంది.

 

గుజరాత్ సినిమాకి ఇది రీమేక్ అని డైరెక్టర్ చెప్పారు. ఆ సినిమా చూశారా ?

 

లేదండి, చూడలేదు. ఆ సినిమా మెయిన్ పాయింట్ మాత్రమే ఈ సినిమా కోసం తీసుకున్నారు. తెలుగు నేటివిటీకి తగట్టు ఈ సినిమా స్క్రిప్ట్ లో చాల మార్పులు చేశారు. క్యారెక్టర్స్ కూడా చాల మారాయి. అయినా ఆ సినిమా చూస్తే.. ఆ సినిమాలో చేసిన ఆర్టిస్ట్ లానే నేను చెయ్యాలనుకుంటే ఎలా.. కొత్తగా చేయాలనే తాపత్రయం నాకు ఉంది. ఈ సినిమా కోసం నేను చాల హార్డ్ వర్క్ చేశాను.

 

కళ్యాణ్ రామ్ తో కలిసి పని చేయడం ఎలా అనిపించింది. ఆయన గురించి ?

 

‘ఎంత మంచివాడవురా’ అనే టైటిల్ ఆయనకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఆయన చాల స్వీట్ పర్సన్.. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ హానెస్ట్.. చాల సింపుల్ గా ఉంటారు. నువ్వు మంచి యాక్టర్ వి అని చాల సపోర్ట్ చేశారు. ఆయన ఫస్ట్ కాపీ చూసి.. చాల బాగా చేశావ్ అని మెసేజ్ పెట్టారు. కళ్యాణ్ రామ్ గారితో పనిచేయడం చాల అనందంగా ఉంది.

 

‘ఎఫ్ 2’లో మీ క్యారెక్టర్ కి మీరే డబ్బింగ్ చెప్పారు. మరి ఈ సినిమాకి ఎందుకు చెప్పలేదు ?

 

‘ఎఫ్ 2’లో హాని క్యారెక్టర్ కు నేనే డబ్బింగ్ చెప్పాను. అయితే ఈ సినిమా కోసం కూడా నేను డబ్బింగ్ చెప్పాలని స్టార్ట్ చేశాను. కానీ కొన్ని తెలుగు పవర్ ఫుల్ వర్డ్స్ ఉన్నాయి. నాకు తెలుగు పూర్తిగా రాకపోవడంతో.. ఆ పదాలను సరిగ్గా పలకలేకపోయాను. అందుకే డబ్బింగ్ వేరే వాళ్ళ చేత చెప్పించాము. అది చాల ప్లస్ అయింది.

 

దర్శకుడు సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో పనిచేయడం ఎలా అనిపించింది. అలాగే ఆయన గురించి ?

 

ఆయన నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడే నాకు గూజ్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే నా కెరీర్ లో నేను ఇంత బలమైన క్యారెక్టర్ ను ఎప్పుడూ చేయలేదు. అదే విషయం గురించి నేను డైరెక్టర్ గారిని అడిగాను. ఇలాంటి బలమైన క్యారెక్టర్ లో నన్ను ఎలా అనుకున్నారు అని. నువ్వు చెయ్యగలవు అనే నమ్మకం మాకు ఉందన్నారు. నేను వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను.

 

ఈ నెలలో మీరు నటించిన రెండు చిత్రాలు ‘ఎంత మంచివాడవురా, అశ్వథ్ధామ’ విడుదలకు కాబోతున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు ?

 

నేను కూడా ఈ సినిమాల రిలీజ్ కోసమే చాల ఎగ్జైట్ గా ఉన్నాను. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయనే నమ్మకం ఉంది.

సంబంధిత సమాచారం :