కొడుకు సినిమా కల కోసం పీఎఫ్ డబ్బుల త్యాగం.. ‘కొత్త సినిమా’ వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ!

కొడుకు సినిమా కల కోసం పీఎఫ్ డబ్బుల త్యాగం.. ‘కొత్త సినిమా’ వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ!

Published on Jul 8, 2026 3:45 PM IST

Kotha Cinema

సినిమా అంటే కేవలం హైదరాబాద్, లండన్ వంటి నగరాల్లోనే కాదు.. పల్లెపల్లెనా, ప్రతి గల్లీలోనూ కళ ఉంటుందని నిరూపిస్తూ వస్తున్న చిత్రం “కొత్త సినిమా”. సురేశ్, రాకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సరికొత్త లోకల్ టాలెంట్‌తో దర్శకుడు అజర్ రూపొందించారు. ఈ చిత్రం ద్వారా దాదాపు వంద మంది కొత్త వాళ్లు వెండితెరకు పరిచయం కావడం విశేషం. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ‘మేము కూడా సినిమా తీసినామురో..’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో ఘనంగా లాంఛ్ చేశారు.

ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు ఆర్‌కే సాగర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు తమ మద్దతును ప్రకటించారు. చరణ్ అర్జున్ అద్భుతమైన లిరిక్స్ అందిస్తూ కంపోజ్ చేసిన ఈ పాట.. హైదరాబాద్ వచ్చి తమ సినిమా కలను నెరవేర్చుకోలేని ఎంతోమంది ఔత్సాహికుల ఆవేదనను ప్రతిబింబించేలా సాగుతుంది.

బొగ్గు గనుల నేపథ్యం.. తండ్రి పీఎఫ్ డబ్బులతో కొడుకు కల!

ఈ సినిమా వెనుక ఒక బలమైన ఎమోషనల్ జర్నీ ఉంది. దర్శకుడు అజర్ తండ్రి హుస్సేన్ గారు ఒక సింగరేణి ఉద్యోగి. కొడుకు సినిమా కలను నిజం చేయడం కోసం ఆయన తన 40 ఏళ్ల కష్టార్జితాన్ని, పీఎఫ్ డబ్బులను ఈ సినిమా నిర్మాణం కోసం ఖర్చు చేయడం అందరినీ కదిలిస్తోంది. “మనం భూమి లోతుల్లోంచి, బొగ్గు బాయిల నుంచి వచ్చాం.. చీకటి నుంచి వెలుగులు పంచే రామగుండం ప్రాంతం నుంచి వచ్చి, మన ఊర్లోనే ఉంటూ లోకల్ టాలెంట్‌తో సినిమా తీయొచ్చని నిరూపించాం” అంటూ దర్శకుడు అజర్ భావోద్వేగానికి గురయ్యారు. చిత్రంలో నటించిన హీరోలు సురేశ్ (కిరాణా షాప్ నిర్వాహకుడు), రాకేష్ (సింగరేణి ఉద్యోగి) తమ ఊర్లోనే ఉంటూ ఆడిషన్స్ ద్వారా ఈ మెయిన్ లీడ్స్ దక్కించుకోవడం విశేషం.

అండగా నిలిచిన మధుర శ్రీధర్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

ఈ వినూత్న ప్రయత్నానికి ఇండస్ట్రీ పెద్దల నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. సినిమాను చూసిన నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అజర్ ఫిలిం మేకింగ్‌లో అన్ని రూల్స్ బ్రేక్ చేశాడని, ఆర్‌జీవీ చెప్పినట్లు ఇది మేడిన్ కరీంనగర్ కాదు.. ‘మేడిన్ గోదావరిఖని’ అని ప్రూవ్ చేశాడంటూ ప్రశంసించారు. అంతేకాదు, ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా విడుదలయ్యేలా తాను అండగా నిలబడతానని ప్రామిస్ చేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. స్థానిక టాలెంట్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం తరపున కూడా ఇలాంటి లోకల్ ఫిలిం మేకర్స్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సరికొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ “కొత్త సినిమా” త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click here for Memu Kuda Cinema Theesinamro – Full Video Song

సంబంధిత సమాచారం

తాజా వార్తలు