సమీక్ష : ‘లవర్స్ డే’ – ఇంట్రస్ట్ గా సాగని లవ్ డ్రామా !

Dev movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : ప్రియా వారియర్, రోష‌న్‌, నూరిన్ షెరిఫ్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, అన్‌రాయ్ త‌దిత‌రులు

దర్శకత్వం : ఒమ‌ర్ లులు

నిర్మాతలు : ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి

సంగీతం : షాన్ రెహ‌మాన్‌

సినిమాటోగ్రఫర్ : శీను సిద్ధార్థ్‌

స్క్రీన్ ప్లే : సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా

ఎడిటర్ : అచ్చు విజ‌య‌న్‌

ఒమర్ లులు దర్శకత్వంలో సోషల్ మీడియా సెన్సేషన్ హీరోయిన్ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ – రోషన్ హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘లవర్స్ డే’. షాన్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఒకసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

రావూఫ్ రోషన్ (రోషన్) ప్రియాని (ప్రియా ప్రకాష్ వారియర్) మొదటి చూపులోనే ఇష్టపడతాడు. ప్రియా కూడా రోషన్ ను అలాగే ఇష్ట పడుతుంది. అయితే రోషన్ తో తను కూడా ప్రేమిస్తున్నట్లు ఒప్పుకోదు. ఈ క్రమంలో గాధ (నూరిన్ షెరిఫ్‌) సహాయ సహకారాలతో రోషన్ అండ్ ప్రియా తమ ప్రేమను ఒకరికి ఒకరు చెప్పుకుంటారు. ఆ తరువాత జరిగే కొన్ని సంఘటనల అనంతరం అనుకోకుండా జరిగే ఓ తప్పు వల్ల రోషన్ – ప్రియాలు తమ ప్రేమకు బ్రేక్ అప్ చెప్పుకొని వీడిపోతారు. కాగా వారిద్దనీ మళ్ళీ కలపడానికి గాధ ఏమి చేసింది ? ఈ క్రమంలో గాధకు రోషన్ పై ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయి ? అదే విధంగా గాధ పై రోషన్ కి ఏ ఫీలింగ్ కలిగింది ? మరి మరో పక్క ప్రియా – రోషన్ ఇద్దరూ మళ్లీ కలుస్తారా ? లేదా ? అలాగే గాధ – రోషన్ బంధం ఫైనల్ గా ఎలా ముగుస్తోంది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా టీజర్ లో ఒకే ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. దాంతో సినిమా టీజర్‌‌ కూడా బాగా వైరల్ అయి.. సినిమా పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. కానీ ప్రియా వారియర్ సినిమాలో ఆ అంచనాలను అందుకోలేకపోయినా ఉన్నంతలో తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు తన గ్లామర్ తో పర్వాలేదనిపిస్తోంది. ముఖ్యంగా ప్రియా ప్రకాశ్ వారియర్, రావూఫ్ రోషన్ జంట మధ్య వచ్చే సన్నివేశాలు అలాగే వారి మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

అదేవిధంగా మరో హీరోయిన్ గా నటించిన నూరిన్ షెరిఫ్‌ తన గ్లామర్ తో పాటుగా తన నటనతోనూ మెప్పిస్తోంది. ముఖ్యంగా హీరోకు ఆమెకు మధ్య వచ్చే సీన్లతో పాటు వెరీ ఎమోషనల్ సాగే క్లైమాక్స్ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా బాగా నటించింది.

ఇక హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటులతో పాటు, కాలేజీలో పనే చేసే స్టాఫ్, వాళ్ళలో మెయిన్ గా ఫ్యూన్ మరియు డ్రిల్ మాస్టర్ తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో ద్రౌపది నాటకం లాంటి కొన్ని సీన్స్ లో బాగానే నవ్విస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు ఒమర్ కొత్తవారితో యూత్‌ ఫుల్ కంటెంట్‌ తో, యూత్ ని టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమాలో స్నేహం విలువ చెప్పే కొన్ని సన్నివేశాల్లో ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయన ఆకట్టుకుంటారు.

మైనస్ పాయింట్స్ :

స్నేహం, ప్రేమ విలువను వాటి మధ్య తేడాను చెప్పే ప్రయత్నంలో దర్శకుడు అనుకున్న కథను తెర మీదకు ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా సాగతీత సీన్లతో నవ్వు రాని రొటీన్ కామెడీతో నడిపితే, సెకెండ్ హాఫ్ లో ప్లో లేని సన్నివేశాలతో అప్పుడే కథను మొదలు పెట్టి.. ఎలివేట్ కాని కథలోని మెయిన్ ఎమోషన్ తో సినిమాని చాలా బోరింగ్ గా నడిపారు.అయితే ఎమోషనల్ సాగే క్లైమాక్స్ తో మెప్పించే ప్రయత్నం చేసినా, అప్పటికే సినిమా పై ప్రేక్షకుడిగా విసుగు, చికాకు వచ్చేస్తోంది.

అసలు సినిమాలో చెప్పుకోవడానికి చాలా క్యారెక్టర్స్, చాలా ట్రాక్స్ ఉన్నాయి కానీ.. (హీరో ఫ్రెండ్, బయోలజీ మేడమ్ ట్రాక్ తప్ప) ఏది ఆసక్తికరంగా సాగదు. కొన్ని సన్నివేశాల్లో అయితే దర్శకుడు సినిమాని నింపటానికి తనకు తోచినట్లు రాసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా కథలోని మెయిన్ ప్లాట్ సెకెండ్ హాఫ్ లో గాని ప్రారంభం అవ్వదు. అప్పటి వరకూ అనవసరమైన ట్ట్రాక్స్ తో దర్శకుడు టైం వెస్ట్ చేశాడు.

పైగా బాగుంది అనుకున్న క్లైమాక్స్ రావడానికి కారణమైన సీన్స్, క్లైమాక్స్ లో హీరో హీరోయిన్స్ మీద జరిగే దాడి కూడా మరీ సినిమాటిక్ గా, ఎదో అక్కడ కాన్ ఫ్లిక్ట్ రావాలి గనుక పెట్టినట్లుగా అనిపిస్తోంది తప్పా.. కన్విన్స్ డ్ గా అనిపించదు. వీటికి తోడూ యూత్ ని ఆకట్టుకునే ఇంట్రస్టింగ్ కంటెంట్ ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. అది కూడా సరిగ్గా ఎలివేట్ చెయ్యలేక పోయాడు దర్శకుడు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు తన విజన్ కి తగ్గట్లు సరిగ్గా సినిమాని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. పైగా ఆయన రాసుకున్న కథా కథనాలు కూడా ఆసక్తి కరంగా సాగవు. ఇక సినిమాలో శీను సిద్ధార్థ్‌ కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది.

షాన్ రెహ‌మాన్‌ అందించిన తొమ్మిది పాటల్లో రెండు పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తొమ్మిదో పాట చాలా బాగుంది. అలాగే ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లు సాగింది. ఎడిటర్ అచ్చు విజ‌య‌న్‌, దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు తప్ప, తన పనితనం పెద్దగా చూపించినట్లు అనిపించదు. చివరగా నిర్మాణ విలువలు విషయానికి వస్తే.. కథకు తగ్గట్లుగానే నిర్మాణ విలువలు ఉన్నాయి.

తీర్పు :

ఒమర్ లులు దర్శకత్వంలో సోషల్ మీడియా సెన్సేషన్ హీరోయిన్ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ రోషన్ హీరో హీరోయిన్స్ గా వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. దర్శకుడు రాసుకున్న కథాకథనాలు ఆసక్తి కరంగా సాగవు. పైగా సాగతీత సీన్లతో నవ్వు రాని రొటీన్ కామెడీతో ఫస్ట్‌ హాఫ్‌ అంతా నడిపితే, సెకెండ్ హాఫ్ ని ప్లో లేని సీన్స్ తో, అప్పుడే కథను మొదలు పెట్టి.. ఎలివేట్ కాని కథలోని ‘మెయిన్ ఎమోషన్’ తో సినిమాని చాలా బోరింగ్ గా నడిపారు. అయితే ఎమోషనల్ సాగే క్లైమాక్స్ తో మెప్పించే ప్రయత్నం చేసినా, అప్పటికే సినిమా పై ప్రేక్షకుడిగా విసుగు, చికాకు వచ్చేస్తోంది. దాంతో ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని కూడా నిరుత్సాహ పరుస్తోంది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :