సమీక్ష : మోహిని – భయపెట్టబోయి ఇబ్బంది పెట్టింది

సమీక్ష : మోహిని – భయపెట్టబోయి ఇబ్బంది పెట్టింది

Published on Jul 28, 2018 2:10 AM IST
Saakshyam movie review

విడుదల తేదీ : జులై 27, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : త్రిష , జాకీ భగ్నానీ త‌దిత‌రులు

దర్శకత్వం : రమణ మాదేష్

నిర్మాతలు : S. లక్ష్మణ్ కుమార్

సంగీతం : వివేక్, మెర్విన్

సినిమాటోగ్రఫర్ : ఆర్.బి.గురుదేవ్

ఎడిటర్ : దినేష్ పోంరాజ్

త్రిష ప్రధాన పాత్రలో నటించగా జాకీ భగ్నానీ హీరోగా చేసిన చిత్రం ‘మోహిని’. రమణ మాదేష్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

వైష్ణవి(త్రిష) మంచి చెఫ్. హైదరాబాద్ లో ఆమె ఓ ఫేమస్ బేకరికి ఓనర్ కూడా. ఐతే తన ప్రాణ స్నేహితురాలు అమ్ములు పెళ్లి ఆమె కోరుకున్నట్లు జరగాలంటే తను తప్పనిసరిగా పంజు (కమెడియన్ యోగిబాబు)తో లండన్ వెళ్ళాల్సి వస్తుంది.

కాగా వైష్ణవి తన బ్యాచ్ తో లండన్ కి వెళ్ళాకా, ఆమెకు అక్కడ సందీప్ (జాకీ బగ్నాని)తో పరిచయమవడం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జారిపోతాయి. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నే టైంలో కొన్ని నాటకీయ పరిణామాలు జరిగి, వైష్ణవిను ‘దెయ్యం మోహిని’ అవహిస్తోంది. అసలు మోహిని వైష్ణవినే ఎందుకు ఆవహించింది ? దేని కోసం ఆవహించింది ? అసలు మోహిని ఎవరు ? ఎలా చనిపోయింది ? ఎవరు చంపారు ?ఎవరి కోసం దెయ్యంగా తిరిగి వచ్చింది ? చివరకి మోహిని వైష్ణవిని ఏమి చేసింది ? ప్రేమించుకున్న వైష్ణవి, సందీప్ తిరిగి కలుస్తారా ? లాంటి విషయాలు తెలియాలంటే మోహిని చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

త్రిష చెఫ్ వైష్ణవిగా, దెయ్యం మోహినిగా రెండు క్యారెక్టర్ల మధ్య వైవిధ్యాన్ని చూపుతూ తన నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసింది. మొదటి సారి హీరోగా నటించిన జాకీ భగ్నానీ లుక్స్ పరంగా బాగున్నాడు. ఆయన యాక్టింగ్ కూడా పర్వాలేదనిపిస్తోంది. క్లైమాక్స్ లో హీరోకి, హీరోయిన్ కి మధ్య నడిచే కొన్ని సన్నివేశాల్లో కాన్ ఫ్లిక్ట్ బాగుంది.

ఇక ఈ చిత్రంలో కొత్తగా కనిపించిన ఒకప్పటి హీరో సురేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే చూడగానే నవ్వు వచ్చే కమెడియన్ యోగిబాబు తన లుక్స్ తోనే కాకుండా, తన కామెడి టైమింగ్ తో కూడా అక్కడక్కడ బాగానే నవ్వించాడు. అదేవిధంగా జాకీ, మధుమిత ఇలా మిగిలిన నటినటులు కూడా తమ పాత్ర పరిధిమేరకు బాగానే నటించారు.

సినిమాను చాలా రిచ్ గా తీశారు. సినిమాలోని విజువల్స్ ఆకట్టుకుంటాయి. మొత్తం మీద చాలా గ్యాప్ తరువాత త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కావడంతో సాధారణంగా ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై కొంత ఆసక్తి ఉండడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో దర్శకుడు చిన్నపాటి లైన్ ను పట్టుకుని, దాని చుట్టూ ఆయన అల్లుకున్న కథ కథనం, ఆయన సృష్టించిన పాత్రలు ఆశించనంతగా ఎంటర్టైన్ చేయలేకపోయాయి.

ముఖ్యంగా దర్శకుడు తన పాయింట్ ను ఎలివేట్ చేస్తూ రాసుకున్న ట్రీట్మెంట్ ఆకట్టుకోదు. అలాగే కొన్ని సన్నివేశాలను బాగా చిత్రీకరించినప్పటికి, సినిమాలో ఎక్కువ భాగం రొటీన్ అంశాలతో, రోత పుట్టించే పాత కామెడీనే ఉండటం వల్ల సినిమా ఆసక్తికరంగా సాగకపోగా విసిగిస్తోంది.

మోహిని చిత్రం చూస్తున్నంత సేపు తమిళ నేటివిటినే గుర్తుకొస్తొంది. ఎక్కువమంది తమిళ ఆర్టిస్టులే కావడంతో, సినిమాలో చాలా చోట్ల అరవ వాసనలు ఉండటంతో సినిమా చూస్తున్నంత సేపు తమిళ సినిమాను చూస్తున్నట్లే ఉంటుంది.

అలాగే స్క్రీన్ ప్లేలో చాలా చోట్లా బేసిక్ లాజిక్స్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా సినిమా తీశారా అనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే జోనర్ అయినా దర్శకుడు మాత్రం ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయాడు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు రమణ మాదేష్ దర్శకుడిగా పెద్దగా ప్రతిభ కనబర్చలేకపోయారు. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ సరిగ్గా లేకపోవడంతో తుది ఫలితం తలకిందులైంది.
ఆర్.బి.గురుదేవ్ కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్ చాలా బాగున్నాయి.

వివేక్, మెర్విన్ అందించిన సంగీతం పరవాలేదనిపిస్తోంది. కాకపోతే తమిళ చిత్రాల్లోని బిట్స్ గుర్తువస్తాయి. ఎడిటర్ పనితరం కూడా పర్వాలేదు. నిర్మాతలు చిత్రం పై ఖర్చు పెట్టారు గానీ, స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహించి ఉండాల్సింది.

తీర్పు:

త్రిష ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం పై పెద్దగా ఎవరకి అంచనాలు లేకపోవడమే ఈ చిత్రానికి ప్లస్ అని చెప్పుకోవాల్సిన స్థితిలో ఉంది ఈ చిత్రం ఫలితం. కొన్ని ఎమోషనల్ సీన్స్, ప్రధాన పాత్రల పెర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో మెప్పించే అంశాలు కాగా నవ్వు రాని కామెడీ, విసిగించే సీన్లు, ఆకట్టుకోలేకపోయిన కథ కథనాలతో చివరికి ప్రేక్షకుడ్ని ఇబ్బందిపెట్టేలా తయారయింది మోహిని చిత్రం. కానీ సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ ‘సి’ సెంటర్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు