సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో వస్తున్న యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో సినిమాటిక్ ఎలిమెంట్స్, రిషన్ సినిమాస్, మాన్‌సూన్ టేల్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించగా.. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, గాయకుడు ఎస్‌పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నటీనటులు, నిర్మాతలు తమ అనుభవాలను పంచుకున్నారు. ట్రైలర్‌లో కనిపించిన పాజిటివ్ వైబ్ సినిమా అంతటా ఉంటుందని, పతంగ్ పోటీల విజువల్స్ వరల్డ్‌క్లాస్ స్థాయిలో ఉంటాయని నటుడు వంశీ పూజిత్ తెలిపారు. కైట్స్ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించడం ఒక ఎమోషనల్ జర్నీ అని, కష్టపడి తీసిన ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని హీరో ప్రణవ్ కౌశిక్ పేర్కొన్నారు.
నిర్మాతలు విజయ్‌శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, రమ్య మాట్లాడుతూ.. ఇది కంటెంట్ బేస్డ్ సినిమా అని, చిన్న సినిమాలకు ఉండే సవాళ్లు ఉన్నప్పటికీ క్వాలిటీ విషయంలో రాజీపడలేదని తెలిపారు. పండుగ వాతావరణానికి తమ సినిమా సరిగ్గా సరిపోతుందని, ఈ ఏడాది విడుదలైన మంచి చిత్రాల్లో ‘పతంగ్’ ఒకటిగా నిలుస్తుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు.


