సమీక్ష : తరువాత ఎవరు – సిల్లీ హారర్ కామెడీ

సమీక్ష : తరువాత ఎవరు – సిల్లీ హారర్ కామెడీ

Published on Aug 3, 2018 6:33 PM IST
Tharuvatha Evaru movie review

విడుదల తేదీ : ఆగష్టు 3, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : మనోజ్, ప్రియాంక శర్మ , కమల్ కామరాజు, భరణి త‌దిత‌రులు

దర్శకత్వం : కృష్ణ ప్రసాద్

నిర్మాతలు : లక్ష్మీ రెడ్డి, రాజేష్ కోడూరు

సంగీతం : విజయ్ కూరాకుల

సినిమాటోగ్రఫర్ : రాజేంద్ర కేసాని

ఎడిటర్ : ఆవుల వెంకటేష్

మనోజ్, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ తరువాత ఎవరు ’. రాజేష్ కొండూరు, కె రాజేష్ రెడ్డిల స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :

చందు (మనోజ్), నిత్య ( ప్రియాంక శర్మ) ఇద్దరు ఒకర్ని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ కొన్ని సంఘటనల కారణంగా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వస్తాయి. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలో పది రోజుల పాటు పదిమంది కలిసి ఓ భూతు బంగ్లాలో ఉండాల్సి వచ్చే ‘భయం అనే రియాలిటీ షో’ కి వెళ్తే 20 లక్షల ప్రైజ్ మనీ వస్తోందని నిత్య, ‘హీరో ఫ్రెండ్స్’ ఆ షోకి వెళ్లాలనుకుంటారు. చందు కూడా నిత్య వెళ్తుందని తాను కూడా ఆ షో కు వెళ్తాడు.
అలా అందరూ కలిసి తమకు తెలియని ఓ భూతు బంగ్లాలోకి ఎంటర్ అవుతారు. అక్కడ నిత్య, పృథ్వి ( సాయి కిరణ్)కు దగ్గరవుతూ ఉండగా అది చూసి తట్టుకోలేని చందు అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఈ లోపే ఎవరో ముసుగులో(కిల్లర్) వచ్చి ఆ పదిమందిలోని ఒక్కొక్కర్ని ఎవరికీ తెలియకుండా చంపుకుంటూ వస్తాడు. అసలు ఆ ముసుగులో ఉన్న వ్యక్తి ఎవరు ? ఎందుకు వీళ్లని చంపుతున్నాడు ? నిత్య చందు ప్రేమని అర్ధం చేసుకుంటుందా ? ఆ ముసుగు కిల్లర్ నుండి చందు తన నిత్యాని ఎలా కాపాడుకున్నాడు ? చివరకి నిత్య, చందు కలుస్తారా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాలసిందే.

ప్లస్ పాయింట్స్:

మొదటి సారి హీరోగా నటించిన మనోజ్ లుక్స్ పరంగా బాగున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయి వేరే అతనితో క్లోజ్ గా మూవ్ అవుతున్న సీన్స్ ల్లో గాని, నిత్యని కిల్లర్ నుండి సేవ్ చేసే సన్నివేశాల్లో గాని, మనోజ్ సెటిల్డ్ గా చాల చక్కగా నటించాడు. హీరోయిన్ గా చేసిన ప్రియాంక శర్మ అందంగా కనిపిస్తూ తన గ్లామర్ తో ఎంటర్టైన్ చేసింది.

కథకి ప్లాట్ పాయింట్ లాంటి క్యారెక్టర్ లో కనిపించిన కమల్ కామరాజు తన నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అలాగే ఓ ముఖ్యమైన పాత్రను పోషించిన భరణి తన నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటులు అక్కడక్కడ నవ్వులు పూయించారు. సినిమాలో చెప్పాలనుకున్నా ‘స్టూడెంట్ ర్యాగింగ్ వల్ల ప్రాణాలు పోతున్నాయి’అనే మెయిన్ థీమ్ బాగుంది.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మంచి ‘స్టోరీ ఐడియా’ ఉందిదాని దాన్ని ఎలివేట్ చేసే క్యారెక్టర్స్ సన్నివేశాలే దర్శక రచయితలూ రాసుకోలేకపోయారు. స్లోగా సాగే ఈ సినిమాలో పండని హాస్యంతోనే చాలా సేపు కాలక్షేపం చేసేశారు. పైగా సినిమాలో ఎక్కడా సరైన ప్లో, ఫీల్ ఉండదు. సప్సెన్స్ ను ఏమోషన్ని ఓకె ప్రేమ్ లో ఇరికించటానికి ఆసాంతం దర్శకులు ప్రయత్నిస్తూనే ఉంటారు గాని, అసలు ఏం జరిగిందో తెలియకుండా సప్సెన్స్, ఇప్పుడు ఏం జరుగుతుందో అనే ఫీల్ లేకుండా ఏమోషన్ ఎలా వస్తుందో దర్శకులకే తెలియాలి.

ఇక సినిమా మెయిన్ గా హత్యలతో కూడిన సంఘర్షణ మరియు బాధ చుట్టే తిరుగుతుంది కానీ, ఒక్క సీన్ లో కూడా ఆ పెయిన్ గాని ఆ కాన్ ఫ్లిక్ట్ గాని ఉన్నట్లు కనిపించదు. దీనికి తోడు లాజిక్ లేని స్క్రీన్ ప్లేతో ఫేక్ క్యారెక్టరైజేషన్స్ తో అదే రొటీన్‌ తంతుతో పరమ బోర్ కొట్టిస్తారు.

ఈ సహజత్వం లేని కథలో రొమాంటిక్ ఫీల్ తో పాటు రొమాన్స్ ను హార్రర్ ను మిక్స్ చేశారు గాని ఏది వర్కౌట్ అవ్వలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకులు రాజేష్ కొండూరు, కె రాజేష్ రెడ్డి స్టోరీ ఐడియా మంచిదే తీసుకున్నప్పటికీ, ఆ ఐడియాని ఎలివేట్ చేసే విధంగా స్క్రిప్ట్ ని రాసుకోలేకపోయారు. పైగా ఉన్న స్క్రిప్ట్ ని కూడా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు.

సంగీత దర్శకుడు విజయ్ కూరాకుల అందించిన పాటల్లో కొన్ని పర్వాలేదనిపించగా ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం స్లోగా నడుస్తున్న ఈ సినిమాకు కొంత ఉత్సాహం తీసుకొచ్చింది. కెమెరా బాధ్యతలను నిర్వహించిన రాజేంద్ర కేసాని తమ కెమెరాతో మ్యాజిక్ చేయకపోయినా పర్వాలేదనిపించారు.

ఎడిటర్ ఆవుల వెంకటేష్ తన కత్తెరకి ఇంకొంచెం పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాతలు తమ ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం పెంచి ఉండాలసింది.

తీర్పు:

ఈ వారం మిగిలిన మూడు చిత్రాలతో పాటు పోటీ పడుతూ మరి విడుదలైన ఈ చిత్రం ఆ పోటీలో ఏమాత్రం నిలబడే స్థాయిలో లేదు. నవ్వు రాని కామెడీ, విసిగించే సీన్లు మినహా ఈ చిత్రం నుండి పొందడానికి ఏమీ లేదు. ఆకట్టుకోలేకపోయిన కథనం, ఆసక్తికరంగా సాగని సన్నివేశాలు, క్లారిటీ లేని పాత్రలు అన్నీ కలిసి ప్రేక్షకుడి సహనాన్ని ఇబ్బంది పెట్టేలా సినిమాను తయారుచేశాయి.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు