
‘ఉత్తమ విలన్’ సినిమాకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురౌతున్నాయి. విభిన్న చిత్రాల ద్వారా, విభిన్న పాత్రల ద్వారా దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా నిలిచే నటుడు కమల్ హాసన్ తాజాగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’. తమిళ, తెలుగు భాషల్లో మే 1న ఏకకాలంలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజా వివాదాల నేపథ్యంలో సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమాలోని ఓ పాట హిందువుల మనోభావాలను కించపరచే విధంగా రూపొందిందని, ఈ సినిమాను నిలిపివేయాలని వీహెచ్‌పీ చెన్నైలో ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా వీహెచ్‌పీ చేసిన ఫిర్యాదుకు మద్దతుగా కొన్ని ముస్లిం సంస్థలు సైతం ఫిర్యాదు చేయడం విశేషంగా కనిపిస్తోంది. ఈ సినిమా సెన్సార్ విషయంలోనూ కమల్‌కు, సెన్సార్ సభ్యులకు చిన్న వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. చివరకు ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, దర్శకుడు లింగుస్వామి సహ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో సి. కళ్యాణ్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే కమల్ హాసనే సమకూర్చడం విశేషం. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ విభిన్నంగా కనిపిస్తున్నారు.

