అక్కినేని అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ‘సిసింద్రీ’ అఖిల్ తొలి సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు వివి వినాయక్ అఖిల్ తొలి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలసి యువ హీరో నితిన్ నిర్మిస్తున్నారు. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వార్తను అఖిల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ… ‘గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో నేను హీరోగా పరిచయమవుతున్న సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. నా డార్లింగ్ ప్రొడ్యూసర్ నితిన్ & సుధాకర్ రెడ్డిలకు అల్ ది బెస్ట్. వీరితో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం అయినందుకు క్షమించండి.’ అని అన్నారు.
నిర్మాత నితిన్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించే అవకాశాన్ని మా చేతుల్లో పెట్టినందుకు నాగార్జున గారికి మరియు నా సోదరుడు అఖిల్ కు థాంక్స్. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. భారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మీ సపోర్ట్ కావాలి. అని అన్నారు.


