గత ఎలక్షన్స్ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అని రెండు రాష్ట్రాలుగా విభజించిన సంగతి మనకు తెలిసిందే. రాష్ట్రాలు రెండైనా అక్కడ, ఇక్కడ ఉన్నది తెలుగువారే.. కావున ఇన్ని రోజులు హైదరబాద్ కే పరిమితం అయిన ఫిల్మ్ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ లోనూ నెలకొల్పాలని చిత్ర సీమలోని ప్రముఖులు ఆలోచనలో ఉన్నారని ఇదివరకే తెలియజేశాం. ఇప్పుడు ఈ ఆలోచనని కార్యరూపాన్ని ఇచ్చి ఫిల్మ్ చాంబర్ ని విశాఖపట్నంలో కూడా ప్రారంభించడానికి సిద్దమయ్యారు. దానికి ముహూర్తం కూడా సెట్ చేసారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కి శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ 12 సోమవారం అనగా రేపు విశాఖపట్నం బీచ్ రోడ్ లోని తొట్లకొండ ప్రాంతంలో మధ్యహ్నం 01:15 నిమిషాలకు న్యూ ఫిల్మ్ నగర్ కల్చరల్ చాంబర్ కి శాకుస్తాపన పూజ జరగనుంది. ఈ వేడుకకి చంద్రబాబు నాయుడుతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఇప్పటి వరకూ చాలా సినిమాలు వైజాగ్ లో షూటింగ్ జరుపుకునేవి, ఇప్పుడు ఎఫ్.ఎన్.సి.సిని వైజాగ్ లోనూ నెలకొల్పుతుండడం వలన ఇక నుంచి వైజాగ్ లో షూటింగ్ జరుపుకునే సినిమాల సంఖ్య మరింత పెరుగుతుందని బావించవచ్చు.


