10 ఏళ్ల క్రితమే మహేష్ తో సినిమా చేయాలనుకున్నా – మురుగదాస్


సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ‘స్పైడర్’ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. దక్షిణాది స్టార్ డైరెక్టర్లలో ఒకరైన మురుగదాస్ డైరెక్ట్ చేయడం వలన ఈ చిత్రానికి ఎనలేని క్రేజ్ దక్కింది. ప్రస్తుతం చివరి పాట షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఇంతలా ఈ సినిమాను తమిళంలో విడుదలచేయడం వెనుక ఇన్నాళ్లు మహేష్ స్ట్రాటజీ మాత్రమే ఉందనుకున్నారు అంతా. కానీ మురుగదాస్ అసలు కారణమని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బయటపడింది.

మురుగదాస్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను 10 ఏళ్ల క్రితమే మహేష్ తో సినిమా చేయాలనుకున్నాను. కానీ నాకున్న కమిట్మెంట్స్ వలన అది కుదరలేదు. అంతేగాక నా సినిమాలన్నీ తమిళంతో పాటు హిందీ, తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. అందుకే ఈసారి తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం చేయాలనుకుని రెండు భాషలు మాట్లాడే హీరో కావాలనుకునే మహేష్ ను సంప్రదించాను. అతను కూడా ఓకే చెప్పడంతో సినిమా మొదలైంది’ అన్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.