నాగ చైతన్యతో టాలెంటెడ్ డైరెక్టర్ సినిమా!

indraganti-and-naga-chaitny
అక్కినేని హీరో నాగ చైతన్య స్టార్ స్టేటస్ సంపాదించే దిశగా కెరీర్‌ను తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన కొత్త సినిమాలు ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ల విడుదలకు సిద్ధం చేస్తూనే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేశారు. ఇందులో మొదటిదైన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా, టాలెంటెడ్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటితో కూడా ఓ సినిమా చేయనున్నారు. దర్శకుడు స్వయంగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ తన కొత్త సినిమా నాగ చైతన్యతోనే ఉంటుందని స్పష్టం చేశారు.

‘అష్టాచమ్మా’, ‘అంతకుముందు ఆ తర్వాత’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘జెంటిల్‌మన్’ సినిమాలతో తెలుగులో దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న మోహనకృష్ణ, నాగ చైతన్య కోసం ఓ కామెడీ ఎంటర్‌టైనర్ సిద్ధం చేశారని తెలుస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇక ఇలా వరుసగా తన ఇమేజ్‌కి సరిపడే కథలనే ఎంచుకుంటూ హీరోగా స్టార్‌డమ్ సంపాదించుకునే దిశగా నాగ చైతన్య చేస్తోన్న ప్రాజెక్టులు మంచి ఆసక్తి రేకెత్తిస్తున్నాయనే చెప్పాలి.