‘వార్ 2’ ఫ్లాప్‌పై నాగవంశీ క్లారిటీ..!

‘వార్ 2’ ఫ్లాప్‌పై నాగవంశీ క్లారిటీ..!

Published on Dec 26, 2025 10:00 PM IST

War 2

ఒకప్పుడు వరుస పరాజయాలతో సతమతమైన జూనియర్ ఎన్టీఆర్, ‘టెంపర్’ చిత్రంతో తన సక్సెస్ జర్నీని మళ్ళీ మొదలుపెట్టారు. ఆ సినిమా తర్వాత తారక్ వెనుదిరిగి చూసుకోలేదు; నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ మరియు దేవర వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూ వచ్చారు. ముఖ్యంగా గత ఏడాది విడుదలైన ‘దేవర’ మిక్స్‌డ్ టాక్‌తో కూడా భారీ వసూళ్లు సాధించి ఆయన స్టార్ పవర్‌ను నిరూపించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ‘వార్-2’ (War 2)పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘వార్-2’ (War 2)బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేక డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 80 కోట్లకు పంపిణీ చేసిన నిర్మాత నాగవంశీ, భారీగా నష్టపోయారని.. ఆ నష్టాల వల్ల ఆయన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తారక్‌కు అత్యంత సన్నిహితుడైన నాగవంశీ ఈ సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నారనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

తాజాగా ఈ రూమర్లపై స్పందించిన నాగవంశీ అసలు నిజాన్ని వెల్లడించి క్లారిటీ ఇచ్చారు. తానూ ఈ సినిమాను జీఎస్టీ కాకుండా రూ. 68 కోట్లకు కొన్నానని, సినిమా సుమారు రూ. 35-40 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలిపారు. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఒప్పందం ప్రకారం యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు తమంతట తామే ముందుకొచ్చి రూ. 18 కోట్లు వెనక్కి ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు వచ్చిన నష్టం రూ. 10 నుండి 15 కోట్ల మధ్య మాత్రమే ఉంటుందని, ప్రచారంలో ఉన్నట్లుగా భారీ నష్టాలేమీ లేవని ఆయన స్పష్టం చేశారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు