ప్రమోషన్ల పేరుతో దర్శకుడ్ని కంగారుపెట్టిన నాగార్జున

Published on Jul 21, 2019 7:15 pm IST

పేరుకి పాత హీరోనే అయినా ఆలోచనల్లో మాత్రం చాలా ట్రెండీగా ఉంటారు అక్కినేని నాగార్జున. సినిమాకు సంబంధించి చేసే ప్రతి పనిలో కొత్తదనం, ఫన్ ఉండేలా చూసుకుంటారు. ఆ కొత్తదనం ఎలా ఉంటుందంటే త్వరలో విడుదలకానున్న ‘మన్మథుడు 2’ సినిమా ప్రమోషన్లను చూస్తే అర్థమవుతుంది. ప్రచార కార్యక్రమాల్ని దర్శకుడు రాహుల్ రవీంద్ర దగ్గర్నుండే మొదలుపెట్టారు నాగ్.

అది కూడా ఒక ప్రాంక్ తరహాలో కావడం విశేషం. ముందుగా రాహుల్ కు ఫోన్ చేసిన నాగ్ డబ్బింగ్ ఎలా జరుగుతుందో వాకబుచేసి ఆ తర్వా ఒక రెస్టారెంట్ పేరు చెప్ప అక్కడకు వెళ్లి తనకిష్టమైన డిష్ తీసుకురావాలని ఆర్డర్ వేశారు. రాహుల్ వెంటనే ఆ రెస్టారెంట్‌కు వెళ్లగా అక్కడ ఉండే వాళ్ళకి నేనే ‘మన్మథుడు 2’ దర్శకుడిని అని గట్టిగా అరిచి చెప్పమని చెప్పారు. మొహమాటంగానే ఆ పని చేశాడు రాహుల్. ఆ వెంటనే అక్కడున్న కస్టమర్ చేతిలో ఉన్న జ్యూస్ బలవంతంగా లాక్కుని తాగేలా, అక్కడి సిబ్బందితో కఠినంగా వ్యవహరించేలా రాహుల్ ను మానిటర్ చేశారు.

ఇక చివరగా అక్కడున్న ఒక పరిచయంలేని అమ్మాయితో కాసేపు మాట్లాడమని చెప్పారు. దాంతో భయపడిన రాహుల్ సర్.. బాగోదేమో అంటుండగానే చేయాలని నాగ్ ప్రోత్సహించారు. చివరికి అది కూడా చేశాడు రాహుల్. ఇలా ప్రాంక్ రూపంలో దర్శకుడ్ని కాసేపు ఆటపట్టించిన నాగ్ ఆ వీడియోను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వస్తోంది. ఇకపోతే ఈ చిత్రం ఆగష్టు 9న భారీ స్థాయిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :