ఆ విషయంలో రాజీ పడేదే లేదన్న నాగార్జున!

Nagarjuna
కింగ్ అక్కినేని నాగార్జునది స్టార్ హీరోల్లో భిన్నమైన శైలి. సరికొత్త ప్రయోగాలను, కమర్షియల్ సినిమా ఫార్మాట్‌కు దూరం పోకుండా చేస్తారన్న పేరుందాయనకు. ఈ క్రమంలోనే ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’ లాంటి వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఈతరం ప్రేక్షకుల్లోనూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నాగార్జున, త్వరలోనే ‘ఓం నమో వెంకటేశాయ’ అనే భక్తిరస చిత్రంతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.

ఇక ఈ సినిమాను ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే విషయంపై నాగార్జున మాట్లాడుతూ.. “ఓం నమో వెంకటేశాయ ఫిబ్రవరిలో కూడా విడుదలవుతుందని నేననుకోను. చాలా విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు మన బాహుబలి లాంటి సినిమాలన్నీ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఒక స్టాండర్ట్ సెట్ చేశాయి. వాటితో పోల్చిచూస్తారు కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాం. అంతా అయిపోయాక, నేను మెచ్చితేనే సినిమా బయటకు వస్తుంది. ఈ విషయంలో రాజీ పడట్లేదు కాబట్టే రిలీజ్ ఎప్పుడదనేది చెప్పలేకపోతున్నా.” అని అన్నారు.

తన కొత్త సినిమా ‘రాజు గారి గది 2’ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ నాగార్జున ‘ఓం నమో వెంకటేశాయ’ గురించి మాట్లాడారు. నాగార్జునతోనే కలిసి అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలను అందించిన రాఘవేంద్రరావు ఓం నమో వెంకటేశాయకు దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.