నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. IFFDలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు..!

Balakrishna

టాలీవుడ్‌లో ఐదు దశాబ్దాలుగా తిరుగులేని హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక పేజీని క్రియేట్ చేసుకున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఘనంగా జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ’ (IFFD) 2026 వేడుకల్లో ఆయనకు ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందజేశారు. తన 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వైవిధ్యమైన పాత్రలు, అంకితభావంతో భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.

మార్చి 25, 2026న న్యూఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ మరియు సాంస్కృతిక రంగాల ప్రముఖులు పాల్గొని ఆయనను అభినందించారు. ఇప్పటికే ఆయన నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవగా, 2025లో భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మభూషణ్’ పురస్కారం తో గౌరవించిన సంగతి తెలిసిందే.

పౌరాణిక పాత్రలైనా, మాస్ యాక్షన్ చిత్రాలైనా తనదైన శైలిలో మెప్పించడం బాలకృష్ణకే సాధ్యం. దశాబ్దాలుగా వెండితెరపై ఆయన చూపిస్తున్న ప్రభావం మరియు ప్రేక్షకులతో ఆయనకున్న అనుబంధం ఈ అవార్డు ద్వారా మరోసారి నిరూపితమైంది. IFFD 2026 వేదికగా దక్కిన ఈ గౌరవంతో బాలయ్య అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version