నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. భారీ తారాగణం నటిస్తోన్న ఈ చిత్రంలో తాజాగా ‘నందమూరి కళ్యాణ్ రామ్’ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా తాజా సమాచారం ప్రకారం ఈ నెల 17వ తేదీ నుండి కళ్యాణ్ రామ్ ఈ చిత్ర షూట్ లో పాల్గొననున్నాడని తెలుస్తోంది. దాదాపు కళ్యాణ్ రామ్ ఈ చిత్రం కోసం 20 రోజులపాటు డేట్స్ ని కేటాయించారు. అయితే ఇటీవలే హరికృష్ణగారు హఠాన్మరణంతో నందమూరి కుంటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రను ఇంకా పెంచాలని, సీనియర్ ఎన్టీఆర్ కోసం, పార్టీ కోసం, ఆయన చేసిన సేవలను కొన్నైనా చిత్రంలో చూపించాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారట.
హరికృష్ణగారు తన సినీ కెరీర్ ను త్యాగం చేసి మరీ అనుక్షణం ఎన్టీఆర్ గారిని కనిపెట్టుకొని ఉన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడే రాజకీయంగా ఎదిగే అవకాశం వచ్చినా.. కుటుంబ పాలన చేస్తున్నాడని, తండ్రికి చెడ్డ పేరు వస్తుందని, రాజకీయ పదవులను హరికృష్ణ కాదనుకున్నారు. ఇలాంటి కొన్ని అంశాలను ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


