
‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు పరిశ్రమ కళ్ళను తన వైపుకు తిప్పుకున్న దర్శకురాలు నందిని రెడ్డి. లేడీ డైరెక్టర్స్ ఎప్పుడో గానీ కనిపించని ఇండస్ట్రీలో తన మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ డైరెక్టర్, తన రెండో సినిమా ‘జబర్దస్త్’ పరాజయం తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. ఇక తాజాగా నందిని రెడ్డి యువహీరో నాగ శౌర్యతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే!
గత నెలలో మొదలైన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని పాటలు, చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. లవర్ బాయ్‌గా మంచి పేరు సంపాదించుకున్న నాగ శౌర్యతో నందిని రెడ్డి తన స్టైల్ రొమాంటిక్ కామెడీ సినిమాతో అలరించనున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక నాగ శౌర్య హీరోగా నటించిన జాదూగాడు ఈనెల 26న విడుదల కానుంది.

