రీమేక్ రైట్స్ కొన్న మన హీరోలకి కొత్త కంగారు

Published on Nov 14, 2019 12:58 pm IST

ఈమధ్య మన హీరోలు పర భాషల్లో రూపొంది, మంచి విజయాల్ని అందుకున్న ప్రయోగాత్మక సినిమాల మీద మనసు పారేసుకుంటున్నారు. ఏకంగా ఆ సినిమాల రీమేక్ హక్కుల్ని భారీ ధర చెల్లించి కొనేసి తెలుగులో చేయడానికి సన్నద్దమవుతున్నారు. కానీ వారందరికీ ఇప్పుడో పెద్ద టెంక్షన్ పట్టుకుంది. అదే డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్.

ఇప్పుడు మన హీరోలు రీమేక్ చేయడం కోసం కొన్న సినిమాలన్నీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ మీద ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి. సీనియర్ హీరో వెంకటేష్ ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న తమిళ చిత్రం ‘అసురన్’ అమెజాన్లో దొరుకుతోంది. వెంకీ ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారని తెలియగానే మన వాళ్లు తమిళంలో ఉన్నా సరే సినిమాను విపరీతంగా చూసేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ హక్కుల్ని కొని తండ్రితో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇది కూడా చాలా రోజుల నుండి అమెజాన్లో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఉంది. చిరు రీమేక్ చేస్తారనే టాక్ రాగానే ఎక్కువమంది చూసేశారు. ఇక నితిన్ చేద్దామనుకుంటున్న హిందీ చిత్రం ‘అంధాదూన్’ పరిస్థితి కూడా ఇంతే. దీన్ని కూడా మనవాళ్లు చూసేశారు. కాబట్టి ఈ సినిమాల కథలన్నిటి మీదా మన ప్రేక్షకులకి ఒక ఐడియా ఉంది. పైగా ఆయా సినిమాల్లో హీరోలు చేసిన పెర్ఫార్మెన్స్, సంగీతం, స్క్రీన్ ప్లే లాంటి ఇతర అంశాల పట్ల బాగా ఇంప్రెస్ అయ్యారు.

కనుక ఇప్పుడు మన హీరోలు ఈ సినిమాల్ని రీమేక్ చేస్తే ఒరిజినల్ వెర్షన్లతో ఖచ్చితంగా పోల్చి చూడటం ఖాయం. దీని మూలంగా మనహీరోల మీద, దర్శకుల మీద ఒత్తిడి, అంచనాలు విపరీతంగా పెరుగుతాయి. ఇదే మన వాళ్లకు కొత్త సమస్యగా మారింది. మరి దీన్ని వాళ్లు ఎలా అధిగమిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More