టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తన మంచి మనసు చాటుకున్నాడు. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 1,000 మంది విద్యార్థులకు ఆయన ఉచితంగా స్కూల్ కిట్లను అందజేశాడు. ‘రక్షాదళ్’సేవా సంస్థ ప్రతినిధి మహేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నిఖిల్ స్వయంగా పాల్గొని, విద్యార్థులకు నోట్‌బుక్స్, పుస్తకాలు మరియు అవసరమైన విద్యాసామగ్రిని పంపిణీ చేశాడు.
ఈ సందర్భంగా నిఖిల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి భవిష్యత్తును మార్చగల అద్భుతమైన శక్తి కేవలం చదువుకే ఉందని చెప్పాడు. విద్యార్థులంతా కష్టపడి చదువుకుని సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలని ఆయన పేర్కొన్నాడు.
సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘రక్షాదళ్’ సంస్థను ఈ సందర్భంగా నిఖిల్ ప్రత్యేకంగా అభినందించారు. సమాజం పట్ల బాధ్యతతో పనిచేస్తున్న ఈ సంస్థ, రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల కోసం మరియు వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని విస్తృతమైన సేవా కార్యక్రమాలను చేపట్టబోతుందని ఆయన వెల్లడించారు.


