నిఖిల్ ‘శంకరాభరణం’ ఫస్ట్‌లుక్ అదుర్స్!

Sankarabharanam
‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ లాంటి మూడు కొత్తదనమున్న సినిమాలతో ఆకట్టుకున్న నిఖిల్ ఈసారి బీహార్ నేపథ్యంలో సాగే మరో సరికొత్త క్రైం కామెడీ సినిమా కోసం సిద్ధమైపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘శంకరాభరణం’ అనే టైటిల్ పెట్టిన రోజునుంచే అంతటా మంచి ఆసక్తి రేకెత్తింది. తెలుగులో స్టార్ రైటర్‌గా వెలుగొందుతున్న కోన వెంకట్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించడంతో సెట్స్‌పైకి వెళ్ళకముందే ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.

గత కొద్దిరోజులుగా స్క్రిప్ట్‌ పనులను పకడ్బందీగా నిర్వహించుకుంటూ వచ్చిన శంకరాభరణం టీమ్ ఈ రోజే షూటింగ్ మొదలుపెట్టింది. నార్త్ ఇండియాలోని సినిమా కథకు సరిపోయే పలు లొకేషన్లను ఈ మధ్యే ఎంపిక చేశారు. ఇక ఈ ఉదయం నుంచే షూటింగ్ మొదలైంది. ఉదయం మొదటి షాట్ ఓకే అయిన వెంటనే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

‘శంకరాభరణం’ అనే లోగో, హీరో హీరోయిన్లు నిఖిల్, నందితలు పరిగెడుతుంటే వెనక కొంతమంది రౌడీలు వెంటపడడం.. ఇలా పోస్టర్‌తోనే క్రైం కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి కిక్కిచ్చారు. ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు ఇప్పట్నుంచే మొదలైపోతాయని చెప్పొచ్చు. తెలుగు సినిమా కథా రచన, ఫిల్మ్‌ మేకింగ్ ప్రక్రియలో శంకరాభరణం ఓ ట్రెండ్ సృష్టించనుందని కోన వెంకట్ ఈ సినిమా విషయంలో మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు నిర్మాత కాగా ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం కానున్నారు.

Exit mobile version