
మాటల మ్యాజిక్‌తో కట్టిపడేసే దర్శక రచయిత త్రివిక్రమ్, లవర్ బాయ్‌గా సూపర్ క్రేజ్ ఉన్న హీరో నితిన్‌ల కాంబినేషన్‌లో ‘అ..ఆ’ పేరుతో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. నితిన్ సరసన సమంత మొదటిసారి హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమా ఈమధ్యే హైద్రాబాద్‌లో వైభవంగా లాంచ్ అయింది. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఇలా రెండు సూపర్ హిట్ సినిమాల తర్వాత హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్ ‘అ ఆ’ అనే సినిమాతో త్రివిక్రమ్‌తో మూడో సారి ఈ సినిమా కోసం జతకట్టడం విశేషం.
ఇక ఇప్పటికే అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పకడ్బందీగా పూర్తి చేసుకున్న సినిమా యూనిట్ అక్టోబర్ 16నుండి సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేసే దర్శకుడు త్రివిక్రమ్, ఈ సినిమాను కూడా ఓ ప్రేమకథకు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ‘అ ఆ’ అనే టైటిల్, ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ అన్న ట్యాగ్‌లైన్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్‌గా నటించనున్నారు.