
బియన్ రెడ్డి అభినయ దర్శకత్వంలో అరుణ్ తేజ్ , చరిష్మా శ్రీకర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం `నీతోనే హాయ్ హాయ్`. కేయస్ ప్రొడక్షన్స్ పతాకం పై డా.యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో డా.యలమంచిలి ప్రవీణ్, డా.ఏయస్ కీర్తి, డా.జి.పార్థ సారధి రెడ్డి ముగ్గురు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. కాగా ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం నాడు హైదరాబాద్ లో హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… ‘టైటిల్ చాలా హాయి హాయిగా ఉంది. వైద్య వృత్తిలో ఉంటూ సినిమా రంగం మీద ఇష్టంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలకు అభినందనలు. సినిమా ఫీల్డ్ లో కష్టాలు, నష్టాలు ఉంటాయి. కానీ సిన్సియర్ గా కష్టపడితే మాత్రం కచ్చితంగా ఫలితం దక్కుతుంది. దర్శకుడు బియన్ రెడ్డి గారు దాసరి గారి లాంటి దర్శకుల వద్ద పని చేసిన అనుభవంతో ఈ సినిమాను అద్భతుంగా తెరకెక్కించారని టీజర్ చూస్తే తెలుస్తుంది. కంటెంట్ బావుంటే కొత్త , పాత లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు` అన్నారు.
దర్శకుడు బియన్ రెడ్డి అభినయ మాట్లాడుతూ…’మార్చి 7న శ్రీకాంత్ గారి చేతుల మీదుగా మా సినిమా ప్రారంభమై విజయవంతంగా పూర్తైంది. వారిది లక్కీ హ్యాండ్. ఆ సెంటిమెంట్ తో శ్రీకాంత్ గారి చేతుల మీదుగానే టీజర్ కూడా లాంచ్ చేశాం. నిర్మాతలు నన్ను , నా కథని నమ్మి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. పాటల షూటింగ్ కోసం వెళ్లినప్పుడు చిక్ మంగుళూరు లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి షూటింగ్ కంప్లీట్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందన్నారు.
నటుడు బెనర్జి మాట్లాడుతూ…`దర్శకుడు చెప్పిన దానికన్నా అద్భుతంగా తెరకెక్కించారు. అనుకున్న షెడ్యూల్ కన్నా ముందే సినిమా పూర్తి చేసి నిర్మాతల దర్శకుడు అనిపించుకున్నారు బియన్ రెడ్డిగారు` అన్నారు.
హీరో అరుణ్ తేజ్ మాట్లాడుతూ…’ఎంతో హాయిగా షూటింగ్ జరిగింది. ఎంతో ఫాస్ట్ గా అనుకున్న దానికన్నా ముందే సినిమా చేశారు దర్శకుడు. అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందన్నారు.
నిర్మాత డా.పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ…`ఎన్నో వ్యయ ప్రయాలస కోర్చి సినిమా చేశాం. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా` అని అన్నారు.

