ఆ స్టార్ దర్శకుడితో దీపికా పదుకొనెకు గొడవలు లేనట్టే

Published on May 26, 2021 2:00 am IST

ఛాలెంజింగ్ రోల్స్ పాత్రలు యాక్సెప్ట్ చేయడంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఎప్పుడూ ముందుంటుంది. అందునా సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో దీపికా మరుపురాని సినిమాలే చేసింది. వీరి కాంబినేషన్లో ‘రామ్ లీల‌, బాజీ రావ్ మ‌స్తానీ, ప‌ద్మావ‌త్’ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మళ్లీ వీరు నాల్గవసారి కలిసి పనిచేయనున్నారు. దీపికా ప్రధాన పాత్రలో ‘బైజు బావ్రా’ అనే సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. ఇందులో దీపికా ప‌దుకొనే రూప‌మ‌తి అనే బందిపోటు నాయ‌కురాలి పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

2022 ద్వితీయార్థంలో ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. గతంలో దీపికా, సంజయ్ లీలా బన్సాలి నడుమ వివాదాలున్నట్టు వార్తలొచ్చాయి. బన్సాలి ప్రస్తుతం ఆలియా ప్రధాన పాత్రలో ‘గంగూభాయ్ కతియవాడి’ చిత్రం చేస్తున్నారు. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చేయాల్సిందిగా బన్సాలి దీపికాను అడిగారట. కానీ దీపికా అందుకు ఒప్పుకోలేదని, పైగా తనను కాదని ఆ సినిమాలో ఆలియా భట్ ను తీసుకోవడం దీపికాకు నచ్చలేదని ప్రచారం జరిగింది. మళ్లీ వీరు కలిసి వర్క్ చేయరని చాలామంది అన్నారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తల మేరకు దీపికా, బన్సాలి నడుమ ఎలాంటి వివాదాలు లేవని, ఒకవేళ గతంలో ఉన్నా ఇప్పుడు సమసిపోయాయని రూఢీ అయింది.

సంబంధిత సమాచారం :