మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ షెరాజ్ మెహదీ హీరోగా, దర్శకుడిగా నటిస్తూ సంగీతాన్ని అందించిన తాజా చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. విహాన్షి హెగ్డే, కృతి వర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మించారు. తాజాగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ విశేషాలను పంచుకున్న చిత్ర బృందం, జనవరి 2న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుత తరం అమ్మాయిలు ఎలా ఉండాలి, వారిని మోసం చేస్తే ఆ అందం రాక్షసిగా ఎలా మారుతుందనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించారు. సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అద్భుతమైన ట్విస్ట్‌లు ఉంటాయని షెరాజ్ మెహదీ తెలిపారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉండటమే కాకుండా, ప్రేక్షకులకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన భాష్య శ్రీ మాట్లాడుతూ.. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులు ఒక మంచి ఫీల్‌తో వస్తారని పేర్కొన్నారు. హీరోయిన్లు కృతి వర్మ, విహాన్షి హెగ్డే తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని, ఈ చిత్రం మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.


