సమీక్ష : ‘పండుగాడి ఫొటో స్టూడియో’ – బోర్ గా సాగే సిల్లీ కామెడీ!

సమీక్ష : ‘పండుగాడి ఫొటో స్టూడియో’ – బోర్ గా సాగే సిల్లీ కామెడీ!

Published on Sep 21, 2019 7:20 PM IST
PandugadiPhotoStudio movie review

విడుదల తేదీ : సెప్టెంబరు 21, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  1.75/5

నటీనటులు : ఆలీ, రిషిత, వినోదకుమార్, బాబుమోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మీ రాంజగన్, చిత్రం శ్రీను, టీనా చౌదరి, సందీప్ రాజా, జబర్దస్త్ రాము తదితరులు.

దర్శకత్వం : దిలీప్ రాజా

నిర్మాత‌లు : గుదిబండి వెంకట సాంబిరెడ్డి

సంగీతం : యాజమాన్య

సినిమాటోగ్రఫర్ : మురళీమోహన్ రెడ్డి

ఎడిట‌ర్‌ : నందమూరి హరి

దిలీప్ రాజా దర్శకత్వంలో పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకం పై ఆలీ, రిషిత హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘పండుగాడి ఫొటో స్టూడియో’. ఈ చిత్రాన్ని గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ:

 

పండుగాడు (ఆలీ) ఫోటో తీస్తే ఎవరికైనా పెళ్లై పోతుంది. చివరికి పశువుల ఫోటో తీసినా వాటికి ఒక తోడు దొరుకుతుంది. ఈ క్రమంలో ఏటిముక అనే గ్రామంలో ఎవ్వరికీ పెళ్లి కాదు. దాంతో పండుగాడి వాళ్ళ ఫోటో తీస్తే.. ఆ గ్రామలోని వాళ్ళకి పెళ్లి అయిపోతుందని పండుగాడు ఆ గ్రామానికి వస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పండు, ఆ గ్రామంలోని కంచు కనకరత్నం(రిషిత)తో ప్రేమలో పడి..

ఆ ప్రేమను గెలిపించుకునే క్రమంలో తన జీవితానికి సంబంధించి ముఖ్యమైన కొన్ని నిజాలు తెలుసుకుంటాడు. ఏమిటి ఆ నిజాలు? పండు తమ ప్రేమను సాధించుకున్నే క్రమంలో అతనికి ఎలాంటి కష్టాలు, అడ్డంకులు వచ్చాయి ? వాట్ని పండు ఎలా ఎదురుకున్నారు ? ఆ ఎదురుకున్నే క్రమంలో పండుకి ఎవరు సాయపడ్డారు? చివరకి పండు అనుకున్నది సాధించాడా ? లేదా ? అసలు పండు ఫోటో తీస్తే పెళ్లి ఎందుకు అవుతుంది? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

ఈ సినిమాలో హీరోగా నటించిన ఆలీ, హీరోగా కనిపించడానికి బాగా ఎఫెక్ట్స్ పెట్టారు. సాంగ్స్ లో డాన్స్ మూమెంట్స్ ను అలాగే యాక్షన్ సీక్వెన్స్ లో ఫైట్స్ ను చాలా చక్కగా కాన్ఫిడెంట్ గా చేసారు. సినిమాలో తన నటనతో, మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేసారు. రిషిత నటన పరంగా పర్వాలేదనిపించినా, తన గ్లామర్ తో మాత్రం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక తల్లి పాత్రలో నటించిన నటి సుధ తక్కువ సీన్స్ లోనే కనిపించనప్పటికీ.. చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు. కొడుకు బాగు కోసం, ప్రాణం ఇచ్చే తల్లిగా ఆవిడ నటన ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తోంది.

మిగిలిన కీలక పాత్రల్లో నటించిన వినోదకుమార్, బాబుమోహన్, జీవ, శ్రీలక్ష్మీ రాంజగన్, చిత్రం శ్రీను, టీనా చౌదరి, సందీప్ రాజా, జబర్దస్త్ రాము తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. బాబుమోహన్, జీవ, తమ కామెడీ టైమింగ్‌ తో కొన్ని చోట్ల నవ్విస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

 

మైనస్ పాయింట్స్:

 

ముందుగా చెప్పుకున్నట్లు. పండుగాడు ఫోటో తీస్తే ఎవరికైనా పెళ్లై పోతుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. కాన్సెప్ట్ ని బట్టే ఈ సినిమా స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి పాయింట్ మీద సినిమా ఎలా తీశారో.. అసలు సినిమాలో చెప్పుకోవడానికి ఈ పాయింట్‌, లాజిక్ లేని బలహీనమైన సీన్లు తప్ప ఏం ఉండదు. ముఖ్యంగా దర్శకుడు ప్లేని తనకు తోచినట్లు రాసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం సంబంధం లేని సీన్లతో అర్ధం లేని కామెడీతో టార్చర్ పెడితే, సెకెండ్ హాఫ్ సాగతీత సన్నివేశాలతో మూర్ఖపు హాస్యంతో విసుగు తెప్పిస్తోంది.

సినిమా మొదలైన పది నిముషాలకే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమయిపోతుంది. కాలం చెల్లిన సీన్స్ తో నవ్వించడానికి శతవిధాలా ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా ఒక్క సారి కూడా నవ్వుకోరు.

దర్శకుడు అనవసరమైన సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశారు. అవసరానికి మించిన పండని హాస్య సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. దీనికి తోడు దర్శకుడు ఉన్న కంటెంట్ ను కూడా పూర్తిగా వాడుకోలేదు. ఆయన కథ కథనాన్ని ఆసక్తికరంగా మలచకపోగా.. క్లైమాక్స్ లో ఉన్న ఎమోషనల్ కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు.

 

సాంకేతిక విభాగం:

 

దర్శకుడు రాసుకున్న కథకథనాల్లో సహజత్వంతో పాటు కనీస విషయం కూడా లేదు. పైగా ఉన్న స్క్రిప్ట్ ను కూడా స్క్రీన్ మీదకి సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. మురళీమోహన్ రెడ్డి కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది. యాజమాన్య అందించిన పాటల్లో ఒక పాట ఆకట్టుకుంటుంది. ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లు సాగదు. ఎడిటర్ దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. సినిమాకి తగ్గట్లుగానే ఈ చిత్ర నిర్మాత గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మాణ విలువలు ఉన్నాయి.

 

తీర్పు:

 

ఆలీ, రిషిత హీరోయిన్లుగా దిలీప్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోదు. కానీ కొన్ని కామెడీ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ లు, ఎమోషనల్ గా సాగే తల్లి సెంటిమెంట్ పర్వాలేదనిపిస్తాయి. కానీ ఆకట్టుకోలేని కథాకథనాలు, అలాగే లాజిక్ లేని బలహీనమైన సీన్లు, ఇంట్రస్ట్ గా సాగని ట్రీట్మెంట్, మరియు చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా సాగడం వంటి అంశాలు కారణంగా ఈ సినిమా సగటు ప్రేక్షకుడ్ని కూడా ఆకట్టుకోదు.
మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

123telugu.com Rating :  1.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు