సమీక్ష : పేపర్ బాయ్ – డీసెంట్ ఎమోషన్స్ ఉన్న రొటీన్ లవ్ స్టోరీ !

సమీక్ష : పేపర్ బాయ్ – డీసెంట్ ఎమోషన్స్ ఉన్న రొటీన్ లవ్ స్టోరీ !

Published on Sep 1, 2018 12:53 PM IST
 Paper Boy movie review

విడుదల తేదీ : ఆగష్టు 31, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : సంతోష్ శోభన్, రియా, తాన్యా , పోసాని కృష్ణ మురళి, బిత్తిరీ సత్తి, విద్యుల్లేక, జయప్రకాష్ రెడ్డి తదితరులు

దర్శకత్వం : జయశంకర్

నిర్మాతలు : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ

సంగీతం : బీమ్స్

సినిమాటోగ్రఫర్ : సౌందర్య రాజన్

స్క్రీన్ ప్లే : సంపత్ నంది

ఎడిటర్ : తమ్మి రాజు

సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో సంపత్ నంది నిర్మాతగా ప్రచిత్ర క్రియేషన్స్, బి ఎల్ ఎన్ సినిమా సంయుక్తంగా జయశంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “పేపర్ బాయ్”. సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది.
 
కథ :

రవి (సంతోష్ శోభన్) బి.టెక్ చేస్తూనే ఆర్ధిక ఇబ్బందులు కారణంగా పేపర్ బాయ్ గా వర్క్ చేస్తుంటాడు. కానీ బుక్స్ బాగా చదివే అలవాటు ఉన్న రవి, అవే బుక్స్ ద్వారా ధరణి (రియా) ఆలోచనలని భావాలని ఇష్టపడుతూ నాలుగేళ్లుగా ఆమెను ప్రేమిస్తుంటాడు. ఆ ప్రొసెస్ లో ఆమెను చూడటం కోసం ఆమె ఇంటి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఇద్దరికీ పరిచయం అవుతుంది. ధరణికి కూడా రవి క్యారెక్టరైజేషన్ బాగా నచ్చుతుంది. ఫైనల్ గా అతని ఆలోచనలు, భావాలు తనకి దగ్గరగా ఉన్నాయని అతన్ని ప్రేమిస్తోంది. తన పేరెంట్స్ కి చెప్పి పెళ్లికి ఒప్పిస్తోంది.

దాంతో రవి, ధరణి నిశ్చితార్ధం కూడా జరుగుతుంది. ఆ తర్వాత రవికి ధరణిని వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తోంది ? అంతగా ప్రేమించిన అమ్మాయిని ఎందుకు రవి వదిలేయాల్సి వచ్చింది ? అసలు వారి పెళ్లికి వచ్చిన సమస్య ఏమిటి ? ఏ కారణంగా వారు వీడిపోతారు ? మళ్ళీ రవి, ధరణి ఎలా కలుస్తారు ? ఎవరి ద్వారా కలుస్తారు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాలసిందే.
 
ప్లస్ పాయింట్స్ :

తన కెరీర్ లో హీరోగా రెండో సినిమా చేస్తోన్న సంతోష్ శోభన్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో అచ్చం పేపర్ బాయ్ లానే ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా హీరోయిన్ తో తనకి మధ్య సాగే సన్నివేశాల్లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని సంతోష్ శోభన్ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు.

‌హీరోయిన్ రియా తన నటనతో ఆకట్టుకుంది. హీరోకి ప్రపోజ్ చేసే సన్నివేశంలో గాని, ముఖ్యంగా హీరోతో సాగే సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు ఆమె నటన బాగుంది. అలాగే కథని ఓపెన్ చేసే మరో కీలక పాత్ర చేసిన తాన్యా కూడా తన నటనతో ఆకట్టుకున్నే ప్రయత్నం చేసింది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె చాలా సెటిల్డ్ గా నటించి మెప్పించింది.

హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటులు మరియు మహేష్ విట్టా, హీరోయిన్ ఫ్రెండ్ గా చేసిన విద్ద్యుల్లేఖ, ఆమె లవర్ గా నటించిన బిత్తరి సత్తి ఉన్నంతలో బాగానే నవ్వించారు.

క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా బాగుంది. ముఖ్యంగా కనిపించకుండా పోయిన హీరో కోసం హీరోయిన్ వెతికే సీక్వెన్స్.. చివరకి అప్పు (కుక్క), మొదటి నుంచి రిజిస్టర్ చేస్తూ వచ్చిన హీరో బోకే ద్వారా.. హీరో హీరోయిన్లను కలపడం ఆకట్టుకుంటుంది.
 
మైనస్ పాయింట్స్:

సినిమా అక్కడక్కడ సరదాగా సాగిన, ఓవరాల్ గా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. దానికి తోడు కొన్ని సన్నివేశాల్లో మరీ నాటకీయత ఎక్కువైనట్లు అనిపిస్తోంది. దర్శక రచయితలూ లవ్ స్టోరీని మంచి ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ లవ్ స్టోరీ అంతగా సంతృప్తికరంగా అనిపించదు.
ఈ రెగ్యూలర్ లవ్ స్టోరీలో మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు ఉన్నా, ఎక్కడా హృదయానికి హత్తుకున్నే విధంగా ఉండవు. పైగా చాలా చోట్ల సినిమాటెక్ గానే సాగుతాయి. ఒక్క క్లైమాక్స్ మినహా మిగతా స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రెడిక్టుబుల్ గా నడుస్తుంది.

అయినా హీరోయిన్ బ్రదర్స్ ఇంటికి వచ్చి బాధ పడగానే, హీరో తన ఫ్యామిలీతో సహా హీరోయిన్ని పూర్తిగా వదిలేసి వెళ్ళిపోవటం కూడా మరీ ఫేక్ గా అనిపిస్తోంది. సరే హీరోయిన్ మీద ప్రేమ కోసం వదిలేసి వెళ్ళిపోయాడు అనుకున్నా, మరి బి.టెక్ చదివిన హీరో చివరికి ఓ పొలంలో పని చేసుకోవడం అంతగా రుచించదు.
 
సాంకేతిక విభాగం :

సంపత్ నంది అందించిన స్క్రిప్ట్ ను, దర్శకుడు జయ శంకర్ బాగానే తెరకెక్కించన్నప్పటికీ, స్క్రిప్ట్ లో కొన్ని లోపాలు ఉండటం కారణంగా.. దర్శకుడు ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలచలేకపోయారు. సంగీత దర్శకుడు బీమ్స్ సమకూర్చున పాటలు పర్వాలేదనిపిస్తాయి. మెయిన్ గా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది.

సౌందర్య రాజన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎక్కడా బ్యూటి తగ్గకుండా మంచి విజువల్ గా చిత్రీకరించారు. ఇక తమ్మి రాజు ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సినిమాలో కథకు అవసరం లేకుండా వచ్చే కొన్ని (మహేష్ విట్టా, అంతగా పండని కామెడీ) సీన్స్ ను ట్రిమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.

నిర్మాతలు సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రానికి అవసరమైన దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టారు. వాళ్లు పాటించిన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
 
తీర్పు: 

దర్శకుడు సంపత్ నంది స్క్రిప్టుని ఇంకా పగడ్బందీగా ఆసక్తికరంగా రాసుకొని ఉండి ఉంటే…ఈ చిత్రం ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా అయి ఉండేది. కాగా హీరో హీరోయిన్ల ప్రేమ కథ, ఇద్దరి మధ్య సాగే కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, చాలా చోట్ల సినిమాని సాగదీశారనిపిస్తుంది. వాటికి తోడు నెమ్మదిగా సాగే కథనం, బలమైన భావోద్వేగాలు పండించే సన్నివేశాలు ఉన్నా, అవి సరిగ్గా ఎలివేట్ కాకపోవడం, కొన్ని సీన్స్ కన్వీన్స్ గా అనిపించకపోవడం లాంటి కారణాలతో సినిమా ఆసక్తికరంగా సాగదు. ఓవరాల్ గా ఓ ఎమోషనల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేదు. కానీ లవర్స్ ని ఈ చిత్రం మెప్పించొచ్చు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు