చిత్ర పరిశ్రమ విరాళాలు ఇవ్వట్లేదన్న వారికి సాలిడ్ ఆన్సర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Published on Oct 22, 2020 8:46 pm IST

ఎవరైనా విమర్శించగలిగేది చిత్ర పరిశ్రమనే. సెలబ్రిటీలు కదా వివాదాలకు రాలేరు అనుకుంటూ చాలా ఈజీగా వాళ్లను టార్గెట్ చేసేస్తుంటారు. అనేక విషయాల్లో ప్రూవ్ అయిన ఈ నిజం తాజాగా వరద విరాళాల విషయంలో కూడ నిరూపితమైంది. వరదలతో హైదరాబాద్ అల్లాడిపోతుంటే ఇండస్ట్రీ ముందుకొచ్చి సహాయం ప్రకటించింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు తన శక్తి కొలది ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయం ప్రకటించారు.

అయితే ఎంతో డబ్బున్న చిత్ర పరిశ్రమ నుండి అందాల్సినంత సహాయం అందడంలేదనే విమర్శలు మొదలయ్యాయి. ఈ విమర్శలకు తాజాగా విడుదల చేసిన ఇంటర్వ్యూలో సాలిడ్ ఆన్సర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ముందుగా సినీ రంగం నుండి సహాయం రావట్లేదు అనే వాళ్ళు తాము ఎంత సహాయం చేస్తున్నామో ప్రశ్నించుకోవాలి అన్న పవన్ పరిశ్రమలో పేరున్నంతగా డబ్బు ఉండదని, లాభాలు వస్తే పన్నుల రూపంలోనే సగం పోతుందని, అదే నష్టం వస్తే పూర్తి భారం సినిమా చేసిన వాళ్లే మొయాలని, ఇది సున్నితమైన పరిశ్రమ.. నష్టాలు వచ్చి ఎంతో మంది జీవితాలే ఎగిరిపోయాయి. అంతెందుకు మా అన్నయ్య సినిమా తీసి నష్టపోతే మా ఇంట్లో అందరం కలిసి ఆస్తులు అమ్ముకుని డబ్బు కట్టాల్సి వచ్చింది అన్నారు.

నిజమైన సంపద వేల కోట్ల టర్నోవర్ చేసే పారిశ్రామిక వ్యక్తల వద్ద, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద, రాజకీయ రంగంలో ఉంది. ఎన్నికల కోసం వేల కోట్లు ఖర్చుపెట్టే పార్టీలు, వందల కోట్లు వెచ్చించే అభ్యర్థులు, సమాచార రంగంలో బాగా సంపాదించిన ప్రముఖులు ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు ముందుకొచ్చి ఎంతోకొంత సహాయం చేయాలి అన్నారు.

సంబంధిత సమాచారం :

More