రామ్ చరణ్, సుకుమార్ ‘రంగస్థలం’ రూ.100 కోట్ల షేర్ ను క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సందర్బంగా నిన్న చిత్ర టీమ్ విజయోత్సవ వేడుకను ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సాధారణంగా తన సినిమా వేడుకల్లోనే కేవలం 5 నిముషాలు మాత్రమే మాట్లాడే పవన్ ఇతర సినిమా ఫంక్షన్లలో ఇంకా తక్కువగా మాట్లాడుతుంటారు. అలాంటిది ‘రంగస్థలం’ ఈవెంట్లో మాత్రం అయన 20 నిమిషులకు పైనే మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆద్యంతం సినిమాను, నటీనటుల్ని, దర్శకుడ్ని అభినందించిన పవన్ రామ్ చరణ్ ను మాత్రం ప్రత్యేకంగా అభినందించారు. ‘రంగస్థలం’ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక గొప్ప సినిమా అని, ఇలాంటి సినిమాను ఆస్కార్ కు నామినేట్ చేయాలన్న పవన్ చరణ్ లో గొప్ప నటుడు ఉన్నాడని, ఇది ఆరంభం మాత్రమేనని ఇలాంటి విజయాలు అతను ఇంకా ఎన్నో సాధిస్తాడని అన్నాడు.
అలాగే చరణ్ తనకు తమ్ముడి లాంటి వాడని, అన్నయ్య వదినలు తనకు తండ్రి, తల్లి లాంటి వారని అంటూ పవన్ ను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని మురిసిపోయారు. ఇలా నిన్న విజయోత్సవ వేదికపై పవన్ సరదాగా గడిపిన విధానాన్ని చూస్తే ‘రంగస్థలం’ సక్సెస్ ను అందరికంటే ఆయనే ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని అర్థమైపోతోంది.


