సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక చిన్నారి వీడియో పవన్ కళ్యాణ్ హృదయాన్ని కదిలించింది. అరుదైన వ్యాధితో పోరాడుతూనే, తన అభిమాన నాయకుడిని ఒక్కసారైనా చూడాలని ఆశపడ్డాడు వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్. ఆ చిన్నారి కోరికను మన్నించిన పవన్.. ఏకంగా అతని ఇంటికే వెళ్లి సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ కలయికకు సంబంధించిన ఎమోషనల్ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మంచంపై ఉన్న ఆ చిన్నారి చేయి పట్టుకుని పవన్ ఆప్యాయంగా పలకరించిన తీరు చూస్తుంటే ఎవరికైనా కంటతడి రాక మానదు.
తన పర్యటన గురించి పవన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా నిరంజన్ చూపిస్తున్న అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం తనను ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇంతటి కష్టకాలంలోనూ ఆ చిన్నారి ముఖంలో చిరునవ్వు చెదరలేదని, అతని మనోధైర్యం ప్రశంసనీయమని కొనియాడారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామితో పాటు, భద్రకాళి అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. “ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో చూడాలని కోరుకుంటున్నాను” అంటూ పవన్ రాసుకొచ్చారు.
ఇదే సమయంలో తన హనుమకొండ పర్యటనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలను జీవితాంతం గుండెల్లో దాచుకుంటానని పవన్ ఉద్వేగానికి లోనయ్యారు. ఒక స్టార్ హీరో, తన అభిమాని కోసం ఇంతలా పరితపించడం అభిమానులనే కాదు, సామాన్యులను సైతం ఆకట్టుకుంటోంది.


