నా మనసుకి బాగా నచ్చిన సినిమా ‘రంగస్థలం’ : పవన్ కళ్యాణ్

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంతలు జంటగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. విడుదలైన రోజు నుండే హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్లలో దూసుకుపోతున్న ఈ సినిమాను నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ తన సతీమణితో కలిసి వీక్షించారు. ఆయనతో పాటు రామ్ చరణ్, ఉపాసనలు, ఇతర చిత్ర టీమ్ సినిమాను వీక్షించడ జరిగింది.

షో తర్వాత ప్రెస్ తో మాట్లాడిన పవన్ ‘తొలిప్రేమ’ తర్వాత నేను బయటికొచ్చి చూసిన సినిమా ఇది. ఎందుకో ఈ సినిమాను థియేటర్లోనే చూడాలనిపించింది. అద్భుతమైన సినిమా. నా మనసుకు బాగా నచ్చింది. నిర్మాత నవీన్ గారు గొప్ప సినిమా తీశారు. సుకుమార్ వాస్తవానికి దగ్గరగా ఉండే కథతో సినిమా చేశారు. సినిమా గురించిన మిగతా విషయాల్ని సక్సెస్ మీట్లో మాట్లాడతాను అన్నారు.