ఎస్వీయార్ మహానటుల్లోనే అగ్రగణ్యులు – పవన్

Published on Jul 4, 2021 12:19 am IST

తెలుగు వెండితెర పై నిండైన విగ్రహంతో తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా సుస్థిర స్థానాన్ని సంపాధించుకున్న మహా నటుడు ‘ఎస్వీయార్’. ఆయన నటించక్కర్లేదు, తెర పై కనిపిస్తే చాలు సినిమాలో కావల్సినంత రౌద్రం, అద్భుతమైన ఎమోషన్ పొంగిపొర్లుతోంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ముందు అప్పటి సూపర్ స్టార్లు కూడా చిన్నబోయారు అంటేనే.. ఎస్వీయార్ నటనా సామర్ధ్యం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

ఘటోత్కచుడు, రావణుడు, కీచకుడు, నేపాళ మాంత్రికుడు, హిరణ్యకశిపుడు ఇలా ఏ పాత్ర చేసినా ఆయనకు ఆయనే సాటి. నటనే శ్వాసగా జీవించి.. చివరకు నటిస్తూనే తుదిశ్వాస విడిచిన ఎస్.వి. రంగారావు జయంతి నేడు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్వీయార్ను స్మరించుకుంటూ తాజాగా ఓ ప్రెస్‌ నోట్‌ ను రిలీజ్ చేశారు.

పవన్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ సారాంశం ఏమిటంటే.. ‘‘తెలుగు చలనచిత్రాన్ని పరిపుష్టం చేసిన మహానటుల్లో అగ్రగణ్యులు శ్రీ ఎస్.వి.రంగారావు గారు. చిన్నపాటి మాటను ప్రభావశీలమైన హావభావంతోనో కఠిన సమాసాలతో కూడిన ఎంత పెద్ద సంభాషణనైనా అలవోకగా పలికి మొత్తం సన్నివేశాన్ని రక్తి కట్టించిన ప్రతిభాశీలి శ్రీ ఎస్.వి.ఆర్. గారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఏ మాధ్యమంలో చూసినా ఆయన నటించిన చిత్రాలు… వాటి విశేషాలే. వాటిని చూస్తుంటే ఎస్వీఆర్ గారు మన సినిమాపై ఎంతటి బలమైన ముద్ర వేశారో అర్థం చేసుకోవచ్చు. అంటూ పవన్ కళ్యాణ్ ఆయనను కీర్తించారు.

సంబంధిత సమాచారం :