సెట్లో అందర్నీ ఆశ్చర్యపరిచిన పవన్!

17th, October 2016 - 09:58:24 AM

pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచితనం గురించి, తన చుట్టూ ఉండేవాళ్ళను ఆయనెంత బాగా చూసుకుంటారన్న విషయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పవన్‌కు సన్నిహితంగా ఉండేవాళ్ళంతా ఆయన గురించి మాట్లాడమంటే మొదట ఆయన మంచితనం గురించే చెబుతూంటారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ సెట్లో తన చుట్టూ ఉండే వాళ్ల పట్ల ఎంత కేరింగ్‌గా ఉంటారో మరోసారి నిరూపించారు. గత శనివారం రోజున ‘కాటమరాయుడు’లో పవన్‌కు తమ్ముడిగా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న శివబాలాజీ పుట్టినరోజట.

ఇక ఆ రోజున సెట్స్‌కు రాగానే పవన్ కళ్యాణ్, ఈ విషయం తెలుసుకొని తానే స్వయంగా ఓ కేక్ ఆర్డర్ చేశారట. శివబాలాజీ కుటుంబ సభ్యులను కూడా పిలిపించి, కాటమరాయుడు సెట్లో వైభవంగా శివబాలాజీ పుట్టినరోజు వేడుకలను పవన్ జరిపారు. పవన్ కళ్యాణ్ మానవత్వం, గొప్పదనాన్ని చాటే ఎన్నో విషయాలు చూశామని, ఇలా తన పుట్టినరోజును గుర్తించి, సెలెబ్రేట్ చేయడమనేది మర్చిపోలేని అనుభూతి అని శివబాలాజీ అన్నారు. పవన్ కళ్యాణ్ ఎవ్వరూ ఊహించని విధంగా శివబాలాజీ పుట్టినరోజు వేడుక జరిపడంతో సెట్లో అందరూ ఆశ్చర్యపోయారు.నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న కాటమరాయుడు ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.