మహేష్ సినిమాలో ‘పెళ్ళిచూపులు’ యాక్టర్!

priyadarshi
‘పెళ్ళిచూపులు’ అనే సినిమా గత నెల్లో తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కేవలం కోటిన్నర లోపే బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకు పైగా వసూళ్ళు సాధించడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇక ఈ సినిమాలో కౌశిక్ అనే ఓ పాత్రలో నటించిన నటుడు ప్రియదర్శి, సినిమా విడుదల తర్వాత టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. అతడి కామెడీ డైలాగ్ డెలివరీ అందరినీ బాగా ఆకర్షించింది. ఇక పెళ్ళిచూపులు ఇలా విడుదలైందో లేదో, ఆ వెంటనే ప్రియదర్శికి అవకాశాలు వెల్లువెత్తాయి.

ఇప్పటికే పలు క్రేజీ అవకాశాలను సొంతం చేసుకున్న ఆయన, తాజాగా సూపర్ స్టార్ మహేష్ సినిమాలో అవకాశం సాధించినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ మహేష్‌తో తెరకెక్కిస్తోన్న సినిమాలో ప్రియదర్శి ఓ కామిక్ రోల్‌లో నటించనున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇంకా టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. పెళ్ళిచూపులు తరహాలోనే మహేష్ సినిమాలోనూ ప్రియదర్శి మంచి కామిక్ రోల్ చేయనున్నారట. ఇక ఈ సినిమాయే కాకుండా సుమారు పది ఇతర సినిమాల్లో ప్రియదర్శికి అవకాశాలు రావడం విశేషంగా చెప్పుకోవాలి.