ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ప్రేక్షకులను భయపెడుతూనే థ్రిల్ చేయడానికి మరో సరికొత్త కంటెంట్‌తో వస్తోంది. అంబటి అర్జున్, రమేశ్ ఇందిర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పోచమ్మ’. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్‌గా లాక్ అయింది. ఏప్రిల్ 17 నుంచి ఈ థ్రిల్లర్ తెలుగుతో పాటు తమిళంలోనూ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు ఒకరోజు ముందే ఈ సిరీస్‌ను చూసే స్పెషల్ యాక్సెస్ లభిస్తుంది.
శ్రుతి నాయుడు నిర్మాణంలో రమేష్ ఇందిర డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్టులో ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శ్రీ పూజ కీలక పాత్రలు పోషించారు. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో తాజాగా మేకర్స్ స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సిరీస్ కథ విన్నప్పుడే బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం కలిగిందని ఆహా కంటెంట్ హెడ్ కవిత చెప్పారు. “పోచమ్మ తల్లే ముందుండి ఈ సిరీస్‌ను నడిపించినట్లు అనిపించింది. షూటింగ్ సమయంలో ఏదో ఒక రూపంలో అమ్మవారి గుడి లేదా విగ్రహాలు మాకు ఎదురయ్యేవి. సీన్స్, మ్యూజిక్ అద్భుతంగా వచ్చాయి” అని ఆమె తెలిపారు. ఇదే వేదికపై ఈ ఏడాదే ‘త్రీ రోజెస్ సీజన్ 2’, ‘దూల్ పేట పోలీస్ స్టేషన్’, ‘సర్కార్’, ‘చెఫ్ మంత్ర’ లాంటి ఆసక్తికరమైన కంటెంట్ ఆహాలో రాబోతున్నట్లు కూడా ఆమె ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు.
సైలెంట్‌గా వచ్చి సౌండ్ చేస్తాం..
ఈ సిరీస్‌లో జెస్సీ అనే పాత్ర చేసిన స్నేహల్ కామత్ మాట్లాడుతూ.. చిక్ మంగళూరులో జరిగిన షూటింగ్ తనకు మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందన్నారు. మొదటి రోజు షూటింగ్‌లోనే డైరెక్టర్, కోస్టార్స్ డెడికేషన్ చూసి సిరీస్ సక్సెస్ ఖాయమని ఫిక్స్ అయ్యానని మరో నటి శ్రీ పూజ కాన్ఫిడెంట్‌గా చెప్పారు.
ఇక నటుడు అంబటి అర్జున్ స్పందిస్తూ.. “కొన్ని కంటెంట్‌లు రిలీజ్‌కు ముందు సైలెంట్‌గా ఉన్నా, వచ్చాక మాత్రం గట్టి సౌండ్ చేస్తాయి. పోచమ్మ ఆ కోవలోకే వస్తుంది. పోస్టర్, టైటిల్‌తోనే ఈ ప్రాజెక్ట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. సిరీస్‌కు డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్లే అసలైన హీరోలు. చిన్న పిల్లలు కూడా అద్భుతంగా నటించారు. ఇలాంటి మంచి సిరీస్‌కు హడావుడి అవసరం లేదు, స్ట్రీమింగ్ కాగానే అదే సక్సెస్ అందుకుంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు.


