తెగేదాకా లాగకండి.. మా ఎన్నికపై ప్రకాశ్‌రాజ్ కామెంట్..!

Published on Aug 5, 2021 2:51 am IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు గత కొద్ది రోజులుగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గత పాలక వర్గ పదవి కాలం ముగిసి ఎన్నిక ప్రకటన రాకముందే ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు వంటి వారు ఈ సారి అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించుకున్నారు. కొంత మంది ప్యానెల్‌ని కూడా ప్రకటించుకుని ప్రస్తుత కార్యవర్గంపై తమదైన శైలిలో ఆరోణలను కూడా ఎక్కుపెట్టారు. ఈ మధ్యనే ప్రస్తుత మా ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాయడం తీవ్ర దుమారం రేపింది.

అయితే మా ఎన్నికలపై రాజుకుంటున్న రగడకు త్వరలోనే ఫుల్‌స్టాఫ్ పెట్టాలని కృష్ణంరాజు, మురళి మోహన్, మోహన్ బాబు, శివకృష్ణ తదితర పెద్దలు సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఆగస్టులో 22న ‘మా’ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించి, అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని.. సెప్టెంబర్‌ 12న అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు కథనాలు కూడా వచ్చాయి.

అయితే ఎన్నికల నిర్వహణ ఉంటుందా, ఏకగ్రీవమా అనే వాటిపై ఓ పక్క చర్చలు జరుగుతున్న తరుణంలో ఎన్నికలను వాయిదా వేయబోతున్నారన్న టాక్ బయటికి వచ్చింది. కోవిడ్ ప‌రిస్థితుల‌ నేపధ్యంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను వచ్చే ఏడాది మార్చ్‌కి వాయిదా వేయాలన్న ఆలోచనలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుత ప‌రిస్థితుల‌ను ఉద్దేశించి తెగేదాక లాగకండి అంటూ ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు మరోసారి మా ఎన్నికపై రగడను రాజేసింది. ఇదిలా ఉంటే ప్ర‌కాశ్ రాజ్ అండ్ ప్యానెల్ మా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తుండగా ప్రస్తుత మా అధ్యక్షుడు న‌రేశ్ మాత్రం ఎన్నికలను వాయిదా వేసేందుకు సుముఖత చూపిస్తుండడంతో ప్రకాశ్ రాజ్ ఇలా తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారేమోనన్న సందేహం అందరిలోనూ మెదలుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ ట్వీట్ మాత్రం వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :